కలెక్టర్ పై దాడి చేసిన గ్రామంలో 55 మంది అరెస్ట్

కలెక్టర్ పై దాడి చేసిన గ్రామంలో 55 మంది అరెస్ట్

ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సేకరణ నిమిత్తం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభ రణరంగంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో జరిగిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 

ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై కొంతమంది రైతులు కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ తప్పించుకోగా, ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పైనా దాడి చేశారు. ఔషధ పరిశ్రమకు భూసేకరణ చేపట్టాలని వెళ్లిన అధికారులపై దాడి ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వికారాబాద్‌ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

ఈ దాడి ఘటనపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులపై జరిగిన దాడిని ఖండించారు. గతంలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎన్నో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు జరిగాయని కాని నిన్నటి దాడి ఘటన చాలా దారుణమని విమర్శించారు.

ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే ఏదైనా సమస్య ఉంటే చర్చించాలి కాని దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దాడికి కారకులైన వారిని ఎవరిని వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రభుత్వ కార్యక్రమాలను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.