దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్లను అటకెక్కించి, నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్ ఆధునిక కాలపు “ధనానంద వంశం” అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘నారీ శక్తి వందన్ అధినియం’ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ పార్టీలు మహిళా లోకానికి ద్రోహం చేశాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ వంటి కుటుంబ పార్టీలలో సామాన్య మహిళలకు గౌరవం ఉండదని, కేవలం తమ వారసుల ఎదుగుదల కోసమే అవి పనిచేస్తాయని విమర్శించారు. నల్లగొండలో నిర్వహించిన ‘మహిళా జన్ ఆక్రోశ సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ మహిళా రిజర్వేషన్ల వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని గణాంకాలతో సహా తిప్పికొట్టారు.
నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గదని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణ భారత రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని, ఈ వ్యత్యాసాన్ని తొలగించేందుకే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సీట్లను పెంచుతున్నామని వివరించారు.
సీట్ల పెంపు తర్వాత దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం ప్రస్తుతం ఉన్న 129 నుండి 195కి పెరుగుతుందని, ముఖ్యంగా తెలంగాణలో 17 నుండి 26 సీట్లకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుండి 38కి, కర్ణాటకలో 28 నుండి 42కి, తమిళనాడులో 39 నుండి 59కి, కేరళలో 20 నుండి 30కి సీట్లు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలో దక్షిణ భారత్ ప్రాతినిధ్యం 23.76% నుండి 24% కి పెరుగుతుంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ‘నార్త్-సౌత్’ విభజన సృష్టించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రియాంకా వాద్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒకవేళ ధనానందుడు బతికి ఉంటే, 21వ శతాబ్దంలో, 2026లో కూడా తన నంద వంశం లాంటి పార్టీ నేటికీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే అని అనేవాడని ధ్వజమెత్తారు.
“ధనానందుడి అవినీతి వంశం ఎలా ఉండేదో, నేటి కాంగ్రెస్ కూడా అలాగే ఉంది. తనలాంటి అవినీతి కాంగ్రెస్ ఉందని, తనలాంటి రాహుల్ గాంధీ ఉన్నారని ధనానందుడు అనేవాడు. అందుకే చాణక్యుడు మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే ధనానందుడు మళ్ళీ పుట్టాడు. ఎప్పుడెప్పుడు ధనానందులు వస్తారో, అప్పుడల్లా చాణక్యులు వస్తారు. ధనానందుడిని తొలగించడానికి చాణక్యుడు రావడం అవసరం” అని స్పష్టం చేశారు.
అమిత్ షాను చాణిక్యుడితో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ చాణక్యుడు ఎప్పుడూ దేశహితం తప్ప మరోటి ఆలోచించలేదని, అందుకే ప్రియాంక ఈ గాంధీ వంశం అనే ధనానంద వంశం ఉన్నంత కాలం చాణక్యుడు వస్తూనే ఉంటాడని సంబిత్ పాత్ర చురకలు అంటించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని సంబిత్ పాత్ర మండిపడ్డారు.
మహాలక్ష్మి కింద రూ.2500 చొప్పున నగదు, కళ్యాణమస్తు కింద పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంపు.. ఇలా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళలను కాంగ్రెస్ వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ప్రతి ఇంటికి శౌచాలయాలు, తాగునీరు అందుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కేవలం మోసం, మోసం, మోసం మాత్రమే చేస్తోందని ఎద్దేవా చేశారు.
1990లో రాజీవ్ గాంధీ గారు స్వయంగా ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్రను గుర్తుచేస్తూ, కాంగ్రెస్‌ది మొదటినుంచీ ఓబీసీ వ్యతిరేక మనస్తత్వమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో రైస్ మిల్ వ్యాపారంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ.. “లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ అని చెప్పి, ఇప్పుడు కేవలం రూ.9000 కోట్ల అంశాలనే ఎందుకు ఇచ్చారు? మిగిలిన వేల కోట్లపై కమిషన్లు తీసుకున్నారా?” అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక వైఖరికి తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
మహిళా జన్ ఆక్రోశ సభలో బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాహుల్ సరిదెన, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాసమ్మ తదితరులు పాల్గొన్నారు
More Stories
నాలుగేళ్ళలో తొలిసారిగా డీజిల్ ధర పెంపు తప్పదా?
నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
అమెరికా, ఇరాన్ రెండో దశ చర్చలపై అనిశ్చితి