లెబనాన్‌లో సమాధుల కింద హెజ్బొల్లా భారీ సొరంగం

లెబనాన్‌లో సమాధుల కింద హెజ్బొల్లా భారీ సొరంగం

* ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) గుర్తించింది. దానికి సంబంధించిన వీడియోను సైన్యం విడుదల చేసింది. కిలో మీటర్‌కు పైగా పొడవున ఆ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 

సొరంగ నిర్మాణం కోసం దాదాపు 4500 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించి ఉంటారని ఐడిఎఫ్ అంచనా వేసింది. ఆ వీడియోను పంచుకున్న ఇజ్రాయెల్ సైన్యం అటువంటి సొరంగాలు ఎన్నిటినో ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. ఆ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సామగ్రి ఉన్నట్లు ఐడిఎఫ్ తెలియజేసింది. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్బొల్లా అటువంటి సొరంగాలను నిర్మించినట్లు సైన్యం తెలిపింది. 

మరొక వైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో నిరుడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3186 మంది ప్రాణాలు కోల్పోయారు, 14078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే 53 మంది మరణించారు.

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌ సోమవారం ఇజ్రాయెల్‌పై వరుస రాకెట్‌ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ నగరం ‘హైఫా’ లక్ష్యంగా 90కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హైఫాలో పలు భవనాలు దెబ్బతిన్నాయని, పలువురు గాయపడ్డారని, వాహనాలు ధ్వంసమయ్యాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

హెజ్బొల్లా ప్రయోగించిన పలు మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ ‘ఐరన్‌ డోమ్‌’ అడ్డుకున్నప్పటికీ, మరికొన్ని హైఫాలో పలు జనావాస ప్రాంతాల్ని తాకాయని తెలిసింది. ఒక చిన్నారి సహా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. హెజ్బొల్లా రాకెట్‌ దాడుల్ని ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు (ఐడీఎఫ్‌) ధ్రువీకరించాయి. హైఫా పట్టణం శివారు ప్రాంతాల్ని మిస్సైల్స్‌ తాకాయని ఐడీఎఫ్‌ పేర్కొన్నది.

కాగా, ఇజ్రాయెల్‌ సైనికులు, పౌరులపై ప్రయోగించేందుకు ఇరాన్‌ రసాయన ఆయుధాల్ని సిద్ధం చేసిందన్న వార్తలు వెలువడ్డాయి. ఔషధ తయారీలో రసాయన ఏజెంట్స్‌గా వాడే సింథటిక్‌ ఓపియాయిడ్లు, ఫెంటానేల్‌.. వంటి వాటితో ఇరాన్‌ రసాయన ఆయుధాల్ని అభివృద్ధి చేసిందని అమెరికా రక్షణ రంగ నిపుణుడు మాథ్యూ లెవిట్‌ వెల్లడించారు. 

శక్తివంతమైన రసాయన ఏజెంట్స్‌తో గ్రనెడ్లు, బాంబులను ఇరాన్‌ తయారుచేసిందని, వీటి ప్రభావానికి లోనైతే.. బాధితుల నాడీ వ్యవస్థ కొన్ని క్షణాల్లో దెబ్బతింటుందని తెలిపారు. ఇజ్రాయెల్‌ సైన్యం, పౌరులు లక్ష్యంగా ఈ రసాయన ఆయుధాల్ని ప్రయోగించేందుకు ఇరాన్‌ తయారుచేసిందని చెప్పారు.