తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితిపై భారత్, చైనాలు చర్చలు జరిపాయి. ఈ చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని, ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ఇవి ఎంతో దోహదపడనున్నాయని భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం బీజింగ్‌లో జరిగిన సంప్రదింపులు, సమన్వయ కార్యనిర్వహణ యంత్రాంగం (డబ్ల్యుఎంసిసి) సమావేశంలో ఇరుపక్షాలు సరిహద్దు పరిస్థితికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించాయి.
ఈ సమావేశం అనంతరం డబ్ల్యుఎంసిసి సమావేశంలో సరిహద్దులపై జరిగిన చర్చలు భవిష్యత్ దృష్ట్యా చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని గురువారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన వెల్లడించింది. 2020లో జరిగిన ఘోరమైన గాల్వాన్ లోయ ఘర్షణలు, తదనంతరం నాలుగేళ్లకు పైగా కొనసాగిన సైనిక ప్రతిష్టంభన కారణంగా భారత్ – చైనా సంబంధాలు అంత పటిష్టంగా లేవు.
ఇరు దేశాల మధ్య సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి గత ఏడాది కాలంలో అనేక చర్యలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో బీజింగ్‌లో జరిగిన డబ్ల్యుఎంసిసి సమావేశంలో ఇరుపక్షాలు భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లోని పరిస్థితులపై సమీక్షించాయి. సరిహద్దు ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడటంలో సాధించిన పురోగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించే దిశగా పురోగతికి దోహదపడింది.
డబ్ల్యుఎంసిసి సమావేశం తర్వాత చైనాలో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల తదుపరి సమావేశానికి సమగ్ర సన్నాహాలు చేసేందుకు కలిసి పనిచేయడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి అని ఈ ప్రకటన పేర్కొంది. బీజింగ్ పర్యటన సందర్భంగా భారత అధికారులు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. సరిహద్దు వెంబడి దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఇరు పొరుగు దేశాలు కృషి చేస్తున్న నేపథ్యంలో, వారి మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలను ఈ సమావేశం స్పష్టం చేసింది.

More Stories
ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ‘అక్టోబరు 7’ సూత్రధారి హతం
పాక్ చర్యలకు తగిన పర్యవసానాలు.. భారత్ హెచ్చరిక
అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య