* దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు
గత మూడు నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా-ఇరాన్ ఒక ప్రాథమిక ఒప్పందానికి చేరుకున్నట్టు సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమాల నిలిపివేత, హొర్ముజ్ జలసంధిని తెరవడం తదితర అంశాలతో కాల్పుల విరమణను పొడిగించడానికి వీరు ప్రాథమికంగా ఒక ఒప్పందానికి వచ్చారని, అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియోస్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం మొదట్లోనే ఇరు వర్గాలు 60 రోజుల అవగాహన ఒప్పంద ముసాయిదాకు అంగీకరించాయి. ఇది కనుక అధికారికంగా ఆమోదం పొందితే గత మూడు నెలల పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దశకు ప్రధాన అడుగుగా భావించవచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే, అమెరికాతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందాన్ని మాత్రం ఇరాన్ వెంటనే ధ్రువీకరించలేదు.
గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మళ్లీ మొదలైన మిలిటరీ కవ్వింపులు తీవ్రమై పరిస్థితి చేయి దాటిపోకముందే శాంతి ఒప్పందం జరగాల్సిన ఆవశ్యకత ఉందని వారు పేర్కొంటున్నారు. ఇరాన్ ప్రధాన డిమాండ్ అయిన ఆ దేశంపై విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి తాము ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరప లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవంక, దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు జరిపింది. ఈ స్థావరం అమెరికా దళాలకు, జలసంధిలో నౌకల రాకపోకలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. వ్యూహాత్మక కీలక ప్రాంతంలో భద్రతా సంబంధమైన ముప్పు తలెత్తకుండా చూసేందుకే ఈ ఆపరేషన్ జరిగిందని ఓ అధికారి తెలిపారు.

More Stories
కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య
వాస్తవాధీన రేఖ పరిస్థితిపై భారత్, చైనాలు చర్చలు
ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ‘అక్టోబరు 7’ సూత్రధారి హతం