లెబనాన్‌ వ్యాప్తంగా పేజర్లు పేల్చింది మేమె

లెబనాన్‌ వ్యాప్తంగా పేజర్లు పేల్చింది మేమె
సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో లెబనాన్‌ వ్యాప్తంగా జరిగిన పేజర్ల పేలుళ్లకు తామే కారణమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తొలిసారిగా అంగీకరించారు. పేజర్ల పేలుడుకు ఇజ్రాయెలే కారణమని నెతన్యాహూ బహిరంగంగా అంగీకరించారని ఇజ్రాయెల్‌ న్యూస్‌ ఏజెన్సీ టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌, యెడియోత్‌ అహ్రోనత్‌ తెలిపాయి. అంతేకాకుండా హెజ్బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను తామే హతమార్చామని ఆయన చెప్పారు. హెజ్బొల్లాపై మిలిటరీ చర్యలను తమ రక్షణ శాఖలోనే కొందరు సీనియర్‌ అధికారులు వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
 
మరోవంక, ఇజ్రాయెల్‌-లెబనాన్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ పరిశీలిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులపై యూఎన్‌వో భద్రతా మండలి తీవ్రంగా స్పందించిందని, దాడులు ఆపకుంటే ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో పరిమిత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ యోచిస్తున్నట్టు తెలిసింది.
 
కాగా, లెబనాన్‌, ఉత్తర గాజా స్ట్రిప్‌లపై ఆదివారం ఇజ్రాయిల్‌ నరమేధం కొనసాగించింది. ఈ దాడుల కారణంగా గాజాస్ట్రిప్‌ల్లో 13 మంది చిన్నారులతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో మరో 20 మంది మరణించారు. లెబనాన్‌లో తూర్పు బెకా లోయలోని బాల్‌బెక్‌ సమీప ప్రాంతంపైన, బీరూట్‌కు ఉత్తరాన ఉన్న అల్మాట్‌ గ్రామంపైన ఇజ్రాయిల్‌ ఆదివారం వైమానిక దాడికి పాల్పడింది. 
 
ఈ దాడుల్లో 20 మంది మరణించారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల గురించి ఇజ్రాయిల్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు.ఉత్తర గాజా జబాలియా పట్టణంలోని శరణార్థుల శిబిరంపైన, ఒక నివాస గృహంపైన ఆదివారం ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 30 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. 
 
శరణార్థుల శిబిరం వద్ద 25 మంది మరణించారని, ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా నగరంలోని అల్‌ అహ్లీ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఫాడెల్‌ నయీమ్‌ తెలిపారు. నివాస గృహంపై చేసిన దాడిలో హమాస్‌ ప్రభుత్వంలోని మంత్రి వేల్‌ అల్‌-ఖౌర్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ విషయాన్ని పాలస్తీనా పౌర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతోనే ఈ దాడులు చేశామని చెబుతున్న ఇజ్రాయిల్‌… చిన్నారులు, మహిళలే అధిక సంఖ్యలో మరణించడంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.