సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణస్వీకారం

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణస్వీకారం
భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.  రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పూర్వపు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కేంద్రమంత్రులు అర్జున్‌ రామ్ మేఘ్వాల్, కిరణ్‌ రిజిజు, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌సింగ్‌ పురి, రాజ్‌నాథ్ సింగ్‌, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా తదితరులు హాజరయ్యారు.
 
సీజేఐగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగియడం వల్ల ఆయన స్థానంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఆరేళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. 
 
ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుచేశారు.
 
1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కుటుంబంలో మూడో న్యాయమూర్తి. తండ్రి దేవరాజ్‌ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్‌ఆర్‌ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను తండ్రి అకౌంటెంట్‌ వృత్తిలోకి పంపించాలనుకున్నారు. అయితే ముఖ్యమైన రాజ్యాంగసంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తిపొందిన జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా న్యాయవాద వృత్తివైపే మొగ్గుచూపారు. 
 
ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో జరిగిన ఏడీఎం జబల్‌పుర్‌ కేసు(1976)లో ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేయొచ్చని అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన ఏకైక ధర్మాసన సభ్యుడిగా జస్టిస్‌ హెచ్‌ఆర్‌ఖన్నా చరిత్రపుటలకెక్కారు.
 
ఆ కారణంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ సీనియారిటీ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే వరుసలో ఉన్న ఆయన్ను పక్కనపెట్టి జస్టిస్‌ ఎం.హమీదుల్లాబేగ్‌ను సీజేఐగా చేశారన్న వాదన ఉంది. ఆ కారణంగా జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా తన పదవీకాలం ముగియడానికి మూడునెలల ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. 
 
రాజ్యాంగ మూలస్వరూపాన్ని మార్చకూడదన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కేశవానందభారతి కేసు (1973) ధర్మాసనంలోనూ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ఖన్నా ఉన్నారు.