ఎన్సీపీ అధినేత, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి బారామతిలో పోటీ చేస్తుండగా, ఆయనపై తన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) తరఫున తొలిసారిగా బరిలో నిలిచారు. అజిత్‌పవార్ బారామతిలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా విజయం సాధించారు. బారామతిలో ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు ఇలా ముఖాముఖీ తలపడటం ఇది రెండోసారి.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్‌పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేసి ఓటమి చెందారు. ఇక పొరుగునే ఉన్న కర్జత్-జంఖేడ్‌లో అజిత్ పవార్ మరో మేనల్లుడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) నుంచి బీజేపీకి చెందిన రామ్ షిండేను ఢీకొంటున్నారు.
గడ్చిరోలి జిల్లాలో అహేరి నియోజకవర్గంలో తండ్రి, కుమార్తె పోటీ హాట్ టాపిక్‌గా మారింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) తరఫున తండ్రి బాబా ఆత్రమ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) తరఫున కుమార్తె భాగ్యశ్రీ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మరోవైపు ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ జాదవ్ తన మాజీ భార్య, మాజీ కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దాన్వే కుమార్తె, శివసేన అభ్యర్థిని సంజనా జాదవ్‌తో పోటీలో ఉన్నారు.
అలాగే సంజనా జాదవ్ సోదరుడు సంతోష్ దాన్వే జాల్నాలోని భూకర్దన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ధీరజ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్‌లు కాంగ్రెస్ అభ్యర్థులుగా లాతూర్, లాతూర్ రూరల్‌లో ఉన్నారు. అలాగే మరో మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ రాణే కుమారులు నితీశ్ రాణే, నీలేశ్ రాణేలు కుడల్, కన్కవలీల నుంచి శివసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలో నిలిచారు.
ముంబైలో ఠాక్రే కజిన్‌లు వేర్వేరు సీట్లలో పోటీ చేస్తున్నారు. శివసేన (యూబీటీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే వర్లీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి తరపు బంధువు వరుణ్ సర్దేశాయి బాంద్రాలో రంగంలో ఉన్నారు. అలాగే ఆదిత్య కజిన్ అమిత్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ముంబైలోని మహిమ్ నుంచి పోటీ చేస్తున్నారు.
మాజీ మంత్రి గణేశ్ నాయక్ అయిరోలిలో బీజేపీ నుంచి, ఆయన కుమారుడు సందీప్ సింగ్ బేలాపూర్‌లో ఎన్సీపీ (ఎస్పీ) నుంచి పోటీచేస్తున్నారు. మాజీ మంత్రి విజయ్ కుమార్ గేవిట్ నందూర్‌బర్‌లో బీజేపీ తరపున, ఆయన కుమార్తె, మాజీ ఎంపీ హీనా గేవిట్ స్వతంత్ర అభ్యర్థిగా అక్కల్కువలో బరిలో నిలిచారు. ఎన్సీపీ మంత్రి చగ్గన్ భుజ్‌బల్ యెవలాలో పార్టీ తరపున, అతని మేనల్లుడు, మీజీ ఎంపీ సమీర్ భుజ్‌బల్ నందగావ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎన్సీపీ స్టేట్ చీఫ్ జయంత్ పాటిల్ ఇస్లాంపూర్‌లో, ఆయన మేనల్లుడు ప్రజాక్త్ తాన్‌పురే రాహురి నుంచి పార్టీ టికెట్లతో పోటీ పడుతున్నారు.
బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్ బాంద్రా నుంచి , అతని సోదరుడు వినోద్ షెలార్ మలాద్ వెస్ట్ నుంచి, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి సంతుక్‌రావు హంబార్డే పోటీలో ఉండగా, ఆయన సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్‌రావు హంబార్డే కాంగ్రెస్ నుంచి నాందేడ్ సౌత్ అసెంబ్లీ స్థానంలో రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ వసంత్‌రావు చవాన్ మరణంతో నాందేద్ లోక్‌సభ ఉప ఎన్నిక ఈ నెల 20న జరుగుతుంది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం