ఓబిసిల మధ్య కాంగ్రెస్- జేఎమ్ఎమ్ కూటమి చిచ్చు పెడుతోంది

ఓబిసిల మధ్య కాంగ్రెస్- జేఎమ్ఎమ్ కూటమి చిచ్చు పెడుతోంది

కాంగ్రెస్- జేఎమ్ఎమ్ కూటమి​ ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఝార్ఖండ్​లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

“కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కుట్రల పట్ల జాగ్రత్త వహించండి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వారు ఎంతకైనా దిగజారవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. ఐక్యత లేని వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంది. దేశాన్ని దోచుకుంది” అని హెచ్చరించారు. 

చోటానాగ్​పుర్ ప్రాంతంలో 125పైగా ఉపకులాలను ఓబీసీలుగా పరిగణిస్తున్నారని చెబుతూ వారిని ఒకరిపైకి మరోకరిని (ఉపకులాలను) ఉసిగొల్పి కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ప్రధాని విమర్శించారు. అందకే ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జమ్ముకశ్మీర్​ అధికరణ 370ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాయి. దాని ద్వారా మన సైనికులు మళ్లీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది” అని తెలిపారు.

అందుకే ఆర్టికల్ 370ని మోదీ పాతరేశారని, ఏడు దశాబ్దాలుగా అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో లేదని, మొదటిసారి భారత రాజ్యాంగంపై జమ్ముకశ్మీర్​ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారని ప్రధాని గుర్తు చేశారు.  “ఇది నేను అంబేడ్కర్​ ఇచ్చే నివాళి. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఝార్ఖండ్​లో బీజేపీ నేతృత్వంలోన ప్రభుత్వం అవసరం” అని పిలుపిచ్చారు. 
 
“మీరు(ఝార్ఖండ్​ ప్రజలనుద్దేశించి) పిడికెడు ఇసుక కోసం ఆరాటపడుతున్నారు. కానీ వారు దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. (మేము గెలిస్తే) జేఎమ్ఎమ్​ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సృష్టించిన రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతాం. యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిని వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.