రేవంత్ సీఎం అయితే… కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎం

రేవంత్ సీఎం అయితే… కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరంసహా అన్ని స్కాంలలో కేటీఆర్ ప్రధాన నిందితుడుని తేలిన తరువాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. 
 
‘‘ఒకనాడు జన్వాఢ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగిరేశారనే కారణంతో నీ బిడ్డ పెళ్లిని కూడా చూడనీయకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. అట్లాంటిది ఇయాళ బయటపడుతున్న స్కాంలన్నింట్లోనే కేసీఆర్ కొడుకు ముద్దాయి అని తేలిన తరువాత కూడా ఎందుకు జైల్లో పెడతలేవ్. ఎందుకీ మీనమేషాలు’’అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

“కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగకుండా పోరాటం చేసిన. ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేసిండు. మేం ఫైటర్స్. అందుకే కేసీఆర్ కొడుకుకు నిద్రలో కూడా మేం గుర్తుకొస్తున్నం. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడుకుతో కలిసిపోయిండు. పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటిస్తరు. రాత్రి ఒక్కటైతున్నరు” అంటూ ఆరోపించారు. 
 
“కేసీఆర్ కొడుకు పెద్ద బ్లాక్ మెయిలర్. గత ప్రభుత్వంలో అవినీతిపరుడు. బయటపడుతున్న అన్ని స్కాంలలో ఆయనే సూత్రధారి. అయినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదంటే మీరే అర్ధం చేసుకోండి. చివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చెబితేనే చేశామని నిందితుడు చెప్పినా అరెస్ట్ చేయలే. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయి… కేసీఆర్ కుటుంబమనే కారణమని తేలినా చర్యల్లేవ్..” అంటూ విమర్శించారు.

“రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని సంగెం వద్ద మూసీ కోసం పాదయాత్ర చేస్తున్నడట. నేను నా పాదయాత్రలో ఆ ప్రాంతమంతా తిరిగిన. ప్రజల బాధలు కళ్లారా చూసిన. నేనడుగుతున్నా… రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది సంగెం వద్ద కాదు… మూసీ పునరుజ్జీవంతో ఇండ్లు కోల్పోతున్న బాధిత ప్రాంతాల్లో…. అక్కడ తిరిగితే కదా… పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసేది. ఆరు గ్యారంటీల విషయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలి” అంటూ ఎద్దేవా చేశారు.