బీసీలను కేవలం రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనను తెరమీదకు తెచ్చిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనే తప్పదాలు చేశారని ఆయన మండిపడ్డారు.
నెహ్రూ విధానాలతో ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనుకబడిన వర్గాల పట్ల తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి ఆర్టికల్ 340 అనుగుణంగా 29 జనవరి 1953లో కాకా కాలేల్కర్ నేతృత్వంలో తొలి బీసీ కమిషన్ ఏర్పడిందని చెప్పారు. అయితే కాకా కాలేల్కర్ కమిషన్ ప్రతిపాదనలను నెహ్రూ ప్రభుత్వం వ్యతిరేకించి, వెనుబాటుతనం అనే పదాన్నే తిరస్కరించిందని ధ్వజమెత్తారు. కుల ఆధారిత రిజర్వేషన్ల కంటే విద్య ద్వారానే సాధికారత సాధించవచ్చని నెహ్రూ ప్రకటించారని గుర్తుచేశారు.
ఇందిరా గాంధీ ప్రభుత్వంలోనూ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయలేదని, వీపీ సింగ్ నేతృత్వంలో ఓబిసిలకు రిజర్వేషన్‌పై మండల్ కమిషన్ సిఫార్సులు చేయగా, రాజీవ్ గాంధీ పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులను విభేదించి, వ్యతిరేకించారని ఆయన తెలిపారు. కుల ఆధారిత రిజర్వేషన్లతో దేశం బాగుపడదంటూ, ఆర్థిక పరంగా పేదలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని పార్లమెంటులో ప్రసంగించారని చెప్పారు.
దేశంలో దశాబ్ధాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబంతోనే వెనుకబడిన తరగతుల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. వెనుబడిన తరగతులు, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీసీల పట్ల రేవంత్ ప్రభుత్వం కపట ప్రేమ ఒలకబోస్తున్నదని ధ్వజమెత్తారు.
మొదటిసారిగా దేశంలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు ప్రధాని అయితే.. వారికి కులాన్ని ఆపాదిస్తూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే కోర్టు శిక్ష విధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుతెచ్చుకోవాలని డా. లక్ష్మణ్ హితవు చెప్పారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు మేలు చేసేలా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచే అవకాశమున్నా పెంచకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ ఏడాది పాలన పూర్తవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో, కార్పొరేషన్ల నియామకాల్లో బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 27 మంది బీసీలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించి ప్రాధాన్యత ఇచ్చారని డా. లక్ష్మణ్ చెప్పారు. తొలిసారిగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లు, పాఠశాలలు మరియు నీట్ పరీక్షల్లో ఓబీసీలకు మోదీజీ 27% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం