వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను

వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కు శుక్రవారం చివరి పనిరోజు. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు. దీంతో ఆయనకు ఇవాళ చివరి పనిరోజు కావడంతో సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి సందేశం ఇచ్చారు. 
 
వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవం.. అయినప్పటికీ నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపారు. కాగా, సీజేఐ చంద్రచూడ్‌ 2022 నవంబర్‌ 8 నుంచి ఈ పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’ అని ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
‘‘ఈ కోర్టే నన్ను ముందుకు నడిపించింది. ఇక్కడ మనకు తెలియని వ్యక్తులను కలుస్తాం. మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ప్రతీ కేసు ప్రత్యకమే. ఒక కేసును పోలిన కేసు మరొకటి ఉండదు. నేను కోర్టులో, విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, దయచేసి నన్ను క్షమించాలని నేను కోరుతున్నాను. సిజెఐగా నా చివరి ప్రసంగానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ తన వీడ్కోలు ప్రసంగంలో పేర్కొన్నారు.
 
తన కెరీర్‌ను ప్రతిబింబిస్తూ  న్యాయమూర్తుల పాత్ర యాత్రికులతో సమానమని, సేవ చేయాలనే నిబద్ధతతోనే తాము కూడా ప్రతిరోజూ కోర్టుకు వస్తుంటామని వివరించారు. మనం చేసే పని వల్ల కేసులు బనాయించవచ్చు లేదా పరిష్కరించవచ్చు అని ఆయన తెలిపారు. ’’ఈ న్యాయస్థానాన్ని అలంకరించిన గొప్ప న్యాయమూర్తులకు నివాళులు అర్పిస్తున్నాను. జస్టిస్ సంజీవ్ ఖన్నా వంటి సమర్థుల చేతుల్లో ధర్మాసనాన్ని బదిలీచేయడం నాకెంతో భరోసానిచ్చింది‘‘ అంటూ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

కాగా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన చివరి పనిరోజున అలీఘ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనార్టీ హోదా విషయంలో కీలక తీర్పు వెలవరించారు. మరోవైపు భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సంజీవ్‌ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.

న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్‌ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్‌ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్‌ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.