ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. రోజురోజుకూ కాలుష్యం తీవ్రమవుతోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. దేశ రాజధాని నగరంలో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. అలీపూర్‌లో ఏక్యూఐ 372గా, బావన ప్రాంతంలో 412, ద్వారకా సెక్టార్‌ 8లో 355, ముంద్కాలో 419, నజాఫ్‌గఢ్ ప్రాంతంలో 354, న్యూ మోతి భాగ్‌లో 381, రోహిణిలో 401, పంజాబి బాగ్‌లో 388, ఆర్కేపురంలో 373గా ఏక్యూఐ నమోదైంది. 

ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అధ్వాన స్థితిలో ఉన్నట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ పేర్కొంది. కాలుష్యం నేపథ్యంలో విజిబులిటీ సైతం తగ్గింది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. వివేక్ విహార్, ఆనంద్ విహార్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు దృశ్యమానత తగ్గింది. 

పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతోందని ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. 

కాలుష్య స్థాయిని తగ్గించేందుకు సంబంధిత ఏజెన్సీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయని.. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో శీతాకాల కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ శాఖలు, ఏజెన్సీలు చేస్తున్న పనులను మంగళవారం సమీక్షించనున్నట్లు గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఇందులో అవసరాన్ని బట్టి తగిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. 

అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.