ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వికులది కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మిలు 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీళ్లకు ముగ్గురు సంతానం కాగా వారిలో ఉష ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా ఉంటూనే, శాన్‌డియాగో యూనివర్శిటీలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు.
తండ్రి రాధాకృష్ణ క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. అంతే కాకుండా కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
చిన్నప్పటి నుంచే ఉషకు పుస్తకాలంటే ఇష్టం. ప్లస్ టూ తరవాత యేల్ లా స్కూల్‌లో చేరారు. అక్కడే వాన్స్‌తో పరిచయం. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే అంశంపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారి స్నేహం మెల్ల మెల్లగా ప్రేమగా మారడంతో 2014లో హిందూ పద్ధతిలో కుటుంబసభ్యల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ యూనివర్శిటీలోనే హిస్టరీ సబ్జెక్టులో బీఏ, ఆపై లా డిగ్రీ అందుకున్నారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఎంఫిల్ చేసిన ఆమె కొన్నాళ్లు కార్పొరేట్ న్యాయవాదిగా, లిటిగేటర్‌గా వ్యవహరించారు. ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లా- క్లర్క్‌గా పనిచేశారు. ఈ క్రమంలో విద్య, వైద్య, రక్షణ రంగాలకు చెందిన సివిల్ కేసులెన్నో ఉష వాదించారు. సుప్రీంకోర్టు అడ్వొకసీ క్లినిక్, మీడియా ఫ్రీడం అండ్ ఇన్‌ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్టుల్లోనూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు.
కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూపులతో కలిసి పనిచేశారు. 2014లో మొదటిసారి డెమొక్రటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరుని నమోదు చేసుకున్నారు. అయిత, తరవాత 2018లో ఒహాయో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో రిజిస్టర్ చేసుకున్నారు. వాన్స్‌కు ‘హిల్‌బిలీ ఎలజీ’ రచనలో సాయం చేయడమే కాకుండా 2016, 2022 సెనేట్ క్యాంపెయిన్‌లో ఉష సహకారం అందించారు.
2022లో ఒహాయో సెనేటర్‌గా ఎన్నికకావడంలోనూ, వాన్స్ పొలిటికల్ కెరియర్‌ను తీర్చిదిద్దడంలోనూ ఉష కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తలకెత్తుకున్నారు. ఆ సమయంలో వాన్స్ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ఉష దీటుగా తిప్పికొట్టగలిగారు. అందుకే, వాన్స్ తాజాగా ఓ ఇంటర్వూలో ‘యేల్ స్పిరిట్ గైడ్’ అంటూ తన భార్యని ఉద్వేగంతో పరిచయం చేశారు.
జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. ప్రస్తుతం ఒహాయోలోని సిన్సినాటిలో వీరి కుటుంబం నివసిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత జరిగిన మొదటి మీడియా సమావేశంలోనే జేడీ వాన్స్‌ను ప్రస్తావిస్తూ ఉషా చిలుకూరి పేరునూ ప్రస్తావించారు.
“నేను కొంచెం గర్వంగా ఫీలయిన వెంటనే నాకు నా భార్య ఉష గుర్తుకొస్తుంది. వెంటనే వాస్తవంలోకి తిరిగొచ్చేస్తా. ఎందుకంటే నాకంటే తను సాధించిందే ఎక్కువ. తను ఎంతో తెలివైనది. 1000 పేజీల పుస్తకాన్నైనా కొన్ని గంటల్లో చదవ గలదు. నా తప్పొప్పులను సరిదిద్దుతూ నడిపించే శక్తి ఆమె” అని జెడి వాన్స్ తెలిపారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు