ఇప్పటివరకు 26 రాష్ట్రాల్లో గెలుపొందిన ఆయన, మరో 5 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల్లో అనుకూల ఫలితాల నేపథ్యంలో ట్రంప్ ప్రసంగించారు. అమెరికా ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ మార్పు తమ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని కొనియాడారు.
ఇది అమెరికన్లు గర్వించే విజయమని అన్నారు. తన మద్దతుదారులు చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్ వేదిక పైకి వచ్చారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
“ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం దక్కించుకున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యను పరిష్కరించనున్నా” అని ట్రంప్ తెలిపారు.
ఆ తర్వాత ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గొప్ప ఎంపిక అని ప్రశంసించారు ట్రంప్. కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్‌కు అభినందనలు తెలిపారు. తన సహాయకులు అందించిన సేవలను కొనియాడారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. ప్రజలు ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకుపోయినప్పుడు వారిని రక్షించే చర్యల్లో భాగంగా మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ట్రంప్ విజయాన్ని కొనియాడుతూ, ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద రాజకీయ పునరాగమనమని వాన్స్ అభివర్ణించారు.
ఐడహో, యూటా, మోంటానా, వయోమింగ్, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, కాన్సస్, ఓక్లహామా, టెక్సాస్, ఐడాహో, మిస్సోరీ, ఆర్కాన్సాస్, లుసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాతోపాటు స్వింగ్ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియాలో ట్రంప్ జయకేతనం ఎగురవేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షుడు వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం. అయితే, ఒక నేత అధ్యక్ష పదవి చేపట్టి.. మళ్లీ రెండోసారి ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ. గత 130 ఏళ్ల అమెరికా చరిత్రలో అలాంటి పరిణామం ఇప్పటి వరకూ చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ట్రంప్ సాధించబోతున్నారు. దాదాపు 132 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు.
అంతకుముందు గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ 1884 ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 1888 మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1992లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ట్రంప్ ఆ ఘనత సాధించబోతున్నారు. గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత యూఎస్ ఎన్నికల్లో ఈ విధంగా గెలుస్తున్న రెండో వ్యక్తిగా ట్రంప్ నిలవనున్నారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు