తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు.
బిహెచ్‌ఈఎల్ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చురుకుగా పని చేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.
బీహెచ్‌ఈఎల్ ఉద్యోగం తర్వాత ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత 2007లో టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.
నూతన బోర్డులో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. జ్యోతుల నెహ్రు(జగ్గంపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(కోవూరు) ఎంఎస్ రాజు(మడకశిర) స్థానం దక్కించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితో పాటు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా కొత్త పాలకమండలిలో ఉన్నారు.
రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, కుప్పం క్లస్టర్ ఇన్‌చార్జి వైద్యం శాంతారాం, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా సభ్యులుగా నియమితులయ్యారు.
ఇక జనసేన నుంచి పవన్‌కల్యాణ్ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్, పవన్‌కల్యాణ్ స్నేహితుడు బూరగాపు ఆనంద్‌సాయి, జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి కొత్త బోర్డులో చోటు లభించింది.
అలాగే ఫార్మా రంగంలో ఉన్న నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ సన్నపనేని సదాశివరావు, ఎన్‌ఆర్‌ఐ జాస్తి పూర్ణసాంబశివరావు, కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరే్‌షకుమార్, కాఫీ రంగంలో ప్రముఖుడైన ఆర్‌ఎన్ దర్శన్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్ సభ్యులుగా నియమితులయ్యారు.
ఇక, తమిళనాడుకు చెందిన రామ్మూర్తి, ఎంసీఐ చైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్ కుమారుడు అదిత్‌దేశాయ్, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక నిపుణుడు సౌరభ్ బోరా, కేంద్రమంత్రి అమిత్‌షా సన్నిహితుడు కృష్ణమూర్తి వైద్యనాఽథన్ కూడా సభ్యులుగా స్థానం దక్కించుకున్నారు. స్థానికంగా ఉంటూ శ్రీవారి భక్తుల సమస్యలపై నిరంతరం స్పందించే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డి కూడా నూతన బోర్డులో ఉన్నారు.
తాజా బోర్డులో మరోసారి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో కృష్ణమూర్తి వైద్యనాథన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సుచిత్ర ఎల్లా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన సౌరభ్ బోరా చివరి రెండు బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు.
అలాగే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఇక, కేంద్ర హోం మంత్రికి సన్నిహితుడుగా పేరున్న చెన్నైకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ 2015 నుంచి వరుసగా(ఐదుసార్లు) టీటీడీ బోర్డులో కొనసాగుతున్నారు.
తిరుప్పుర్ బాలుగా పేరున్న బాలసుబ్రహ్మణియన్ పళణిస్వామి గత ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన సోదరుడు రామ్మూర్తి బోర్డులో అవకాశం దక్కించుకున్నారు. అలాగే గత బోర్డులో సభ్యుడిగా ఉన్న కేతిన్ దేశాయ్ కుమారుడు, కుసుమ్ ధీరజ్‌లాల్ ఆస్పత్రి ఎండీ అదిత్ దేశాయ్‌కి ఈసారి అవకాశం లభించింది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి