జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. శనివారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రకమాండర్ ఉస్మాన్‌ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో బిస్కెట్లది కీలక పాత్ర అని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా గల ఉగ్ర సంస్థ లష్కర్ ఎ తయ్యిబా కమాండర్ ఉస్మాన్‌పై సాగిన ఆ కార్యక్రమంలో వీధి కుక్కల వల్ల ఎదురైన సమస్యను అధిగమించడంలో బిస్కట్ల ప్రాముఖ్యాన్ని సీనియర్ అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు.
శ్రీనగర్‌లో జనసమ్మర్దం అధికంగా గల ఖన్యార్ ప్రాంతంలో శనివారం రోజంతా సాగిన ఎన్‌కౌంటర్‌లో ఉస్మాన్ హతుడయ్యాడు. అనంత్‌నాగ్ జిల్లా ఖాన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సైనికులకు వీధికుక్కల రూపంలో సవాల్ ఎదురైంది. అవి మొరిగితే ఉస్మాన్ తప్పించుకునే అవకాశం ఉంది. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన జవాన్లు అవి అరవకుండా ఉండడానికి దారిపొడవునా శునకాలకు బిస్కెట్లు అందిస్తూ వచ్చారు.
లోయ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన ఉస్మాన్ 2000 దశకం ఆరంభంలోని తన తొలి కార్యకలాపాల నుంచి అసంఖ్యాక ఉగ్ర దాడులకు సూత్రధారిగా గణనీయ పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌లో కొంత కాలం గడిపిన తరువాత అతను 2016-17 కాలంలో ఈ ప్రాంతంలోకి తిరిగి చొరబడ్డాడు. నిరుడు పోలీస్ ఇన్‌స్పెక్టర మస్రూర్ వనిని కాల్చిచంపిన ఘటనలో అతనికి పాత్ర ఉందని తెలుస్తోంది.
ఒక నివాస ప్రాంతంలో ఉస్మాన్ ఉన్నాడని వేగులు సమాచారం ఇచ్చినప్పుడు పకడ్బందీగా తొమ్మిది గంటల పాటు ప్రణాళికతో సాగించిన ఆ కార్యక్రమం ఇతర విధాలైన నష్టం లేకుండా విజయవంతమైంది. అక్కడ వీధి కుక్కల అరుపులు ఉగ్రవాదిని అప్రమత్తం చేసే ప్రమాదం ఉంది. దానిని అధిగమించేందుకు అన్వేషణ బృందాలకు బిస్కట్లు సమకూర్చారు. వారు తమ లక్ష్యం చేరుకుంటున్నప్పుడు కుక్కలను సముదాయించేందుకు బిస్కట్లు వినియోగించారు.
భద్రత బలగాల మొత్తం మోహరింపును ఫజర్ (తెల్లవారు జాము ప్రార్థనల) ముందు పూర్తి చేశారు. 30 గృహాలకు భద్రత దళాలు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఎకె47, ఒక పిస్టల్, అసంఖ్యాక గ్రనేడ్లు కలిగి ఉన్న ఉస్మాన్ భద్రత బలగాలతో ముమ్మరంగా కాల్పుల పోరుకు దిగాడు. ఆ ఘర్షణ సమయంలో కొన్ని గ్రనేడ్లు పేలాయి.
అనేక గంటల పాటు ఉద్ధృతంగా సాగిన కాల్పుల పోరు తరువాత ఉస్మాన్‌ను మట్టుబెట్టారు. ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఆ ఎన్‌కౌంటర్ భద్రత బలగాలకు ముఖ్యంగా ఎల్‌ఇటి అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌టి)పై గణనీయ విజయం అయింది.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం