సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం టీఆర్‌సీ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరూ చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. దాడి సంఘటన జరిగిన వెంటనే, ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు వేగంగా స్పందించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గత కొన్ని రోజులుగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో దాడులు, ఎన్‌కౌంటర్‌ల జరుగుతూ ఉండటం పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని ‘సండే మార్కెట్’ వద్ద అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడికి సంబంధించిన వార్తల పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెప్పారు.
అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఎటువంటి సమర్థన లేదని స్పష్టం చేశారు. ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించడానికి భద్రతా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేయాలని చెబుతూ తద్వారా ప్రజలు ఎటువంటి భయం లేకుండా జీవించవచ్చని తెలిపారు.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు