25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
 

ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలిపారు. జమిలి ఎన్నికలు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వస్తాయని తెలుస్తోంది. 

 
ఇక ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించడం గమనార్హం.  నవంబర్ 26వ తేదీన పార్లమెంటు ఉభయ సభల సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్‌ బోర్డ్ సవరణ బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. 
 
ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురుగావ్‌ సభలో అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇండియూ కూటమి సహా దేశంలోని చాలా పార్టీలు. ఈ జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నేపథ్యంలోనే ఈ రెండు బిల్లులు గనక పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష ఇండియా కూటమి సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ సాగతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
ఇక సార్వత్రిక ఎన్నికలు జరిగి 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి శీతాకాల సమావేశాలు ఇవి. వక్ఫ్ సవరణ బిల్లు, జమిలి ఎన్నికలతోపాటు జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను ఆమోదించే తీర్మానాన్ని కూడా ఈ సమావేశాల్లో ఈమోదం తెలపనున్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ వర్షాకాల మొదటి సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరిగాయి. ఆ సమావేశాల్లో లో మొత్తం 15 మీటింగులు జరగ్గా  115 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.