ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగులు అందులో హెచ్చరించారు. శనివారం సాయంత్రం ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు ఒక నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో సమాచారాన్ని యూపీ పోలీసులకు చేరవేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర రానున్నారు. ఇంతలో బెదరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన 24 ఏళ్ల యువతిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ చేసిన ఫాతిమా ఖాన్ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో ముంబై సమీపంలో గల థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి కలప వ్యాపారం చేస్తున్నాడని అధికారి తెలిపారు.
విచారణలో, ఖాన్ సందేశాన్ని పంపినట్లు పోలీసులు కనుగొన్నారు. ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఉల్హాస్‌నగర్ పోలీసులతో కలిసి ఆపరేషన్‌లో మహిళను గుర్తించి, ఆమెను పట్టుకున్నట్లు అధికారి తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నందుకే చంపామని తెలిపారు. సిద్ధిఖీ కుమారుడు జీశాన్, సల్మాన్ ఖాన్‌కు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముస్తఫా అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అలాగే, బాబా సిద్దిఖీ కుమారుడు, బాంద్రా ఎమ్మెల్యే జీషాన్ సిద్దిఖీని కూడా చంపుతామని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌తో సన్నిహితంగా ఉన్నవారు, ఆయన స్నేహితులకు ఇటువంటి కాల్స్ వస్తున్నాయి. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన పలువురు అరెస్టయ్యాయి. ఆయన సోదరుడు అన్మోల్‌ను కూడా అమెరికాలో అరెస్ట్ చేయగా.. అతడ్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
More Stories
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?