పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఆ పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు చోట్ల జరిగిన ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర 24 పరాగణాల జిల్లాలో టిఎంసిలో నెలకొన్న నాయకత్వ సంక్షోభాన్ని ఈ దాడులు వెల్లడి చేస్తున్నట్లు భావిస్తున్నారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మోండల్, ఆమె భర్త మృత్యుంజయ్ మోండల్ గురువారం కాళీ మాతా పూజా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక టీఎంసీ నేత ఖలేక్ మొల్లా నేతృత్వంలో సుమారు 30 మంది వ్యక్తులు తమ కాన్వాయ్‌ను అడ్డగించారని ఎమ్మెల్యే ఉషారాణి ఆరోపించారు. హరోవా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే కార్యకర్తలు తమను కొట్టారన్న ఆరోపణలను ఆమె ఖండించారు
కాగా, మరో సంఘటనలో సందేశ్‌ఖలి ఎమ్మెల్యే సుకుమార్ మహతా గురువారం రాత్రి నజత్ నుంచి తిరిగి వస్తుండగా సిముల్తాలా గ్రామంలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. స్థానిక బలమైన నేత షేక్ షాజహాన్‌తో సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. మరో టీఎంసీ నేత అబ్దుల్ కాదర్ మొల్లా మద్దతుదారులు కూడా దాడిలో పాల్గొన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల షాజహాన్ స్థానంలో సందేశ్‌ఖలీ బ్లాక్ ప్రెసిడెంట్‌గా మిజానూర్ రెహమాన్‌ను నియమించిన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. దీంతో ఈ రెండు సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం