జార్ఖండ్‌ నుండి చొరబాటుదారులను తరిమికొడతాం

జార్ఖండ్‌ నుండి చొరబాటుదారులను తరిమికొడతాం
జార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న చొరబాటుదారులను తరిమికొడతామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత ప్రకటించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  జార్ఖండ్‌లో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువ అవుతోందని పేర్కొన్న అమిత్ షా అందువల్ల గిరిజనుల జనాభా బాగా తగ్గిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
 అదే సమయంలో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.  కొందరు చొరబాటుదారులు జార్ఖండ్‌లోకి ప్రవేశించి ఇక్కడి అమ్మాయిలను ప్రలోభపెట్టి వారిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఇక్కడి భూములను ఆక్రమించుకుంటున్నారని అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి వాటిని అరికట్టకపోతే జార్ఖండ్ రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని హెచ్చరించారు. జార్ఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్‌) ప్రవేశపెడతామని స్పష్టం చేసిన అమిత్ ష దాని నుంచి గిరిజనులను దూరంగా ఉంచుతామని తేల్చి చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌ షా సంకల్ప్‌ పత్ర పేరుతో బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు.
 
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాలనలో జార్ఖండ్‌లో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువ అవుతున్నందు వల్ల సంతాల్ పరగణాలో గిరిజన జనాభా భారీగా తగ్గిపోతుందని అమిత్ షా వెల్లడించారు. జార్ఖండ్‌లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన వారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బీజేపీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.
 
దేశంలోని అన్ని పార్టీల కంటే భిన్నంగా బీజేపీ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్న వారిపై సీబీఐ, సిట్ సోదాలు నిర్వహించి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
జార్ఖండ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా -జేఎంఎం ప్రభుత్వం చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. జార్ఖండ్ ప్రజలకు భద్రత కల్పించడంలో సీఎం హేమంత్ సోరెన్ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు.  తన “సంకల్ప్ పత్ర”లో, బిజెపి రాష్ట్రం ఏర్పడిన 25 సంవత్సరాల జ్ఞాపకార్థం 25 తీర్మానాలను సమర్పించింది. ఒక ముఖ్య వాగ్దానం “గోగో దీదీ” పథకం. దీని ద్వారా మహిళలకు నెలవారీ భత్యం రూ. 2,100 అందజేస్తారు. 

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక హామీలు

  • రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఏటా రెండు ఉచిత సిలెండర్లు
  • ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగావకాశాలు
  • మహిళలకు ప్రతి నెలా రూ.2,100
  • ఉమ్మడి పౌరస్మృతి అమలు, గిరిజనులకు మినహాయింపు
  • 21 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లతో కూడిన కాంక్రీట్ ఇళ్లు
  • యువకులకు వారి కెరీర్‌ను నిర్మించుకొనేందుకు రెండేళ్లపాటు నెలవారీ రూ.2,000 స్టైఫండ్‌
  • జార్ఖండ్ గిరిజన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి సిద్ధో-కాన్హో పరిశోధనా కేంద్రం ఏర్పాటు
  • జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సిజిఎల్) పరీక్ష రద్దు
  • గత సిజిఎల్,  ఇతర ముఖ్యమైన పేపర్ లీక్ కేసులపై సిబిఐవిచారణ 
  • ఏదైనా స్థానభ్రంశం సంభవించే ముందు పునరావాస ప్రక్రియలు పూర్తయ్యాయని నిర్ధారించడానికి కమిషన్ ఏర్పాటు
  • అక్రమ భూ ఆక్రమణలను అరికట్టేందుకు, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కఠిన చట్టాలు