బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యుల నిరసన సెగలు చల్లారకముందే ఇప్పుడు హోంగార్డుల భార్యలు ఆందోళనలకు దిగారు. తమ సమస్యలను పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు హోంగార్డుల భార్యలను అరెస్టు చేసి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన హోంగార్డులు, హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టేందుకు పిలుపునిచ్చారు.
ఈ దశలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో హోంగార్డులు, వారి కుటుంబాలు తరలిపోకుండా పోలీసులు మోహరించారు. పోలీస్‌స్టేషన్లు దాటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వేలాది మంది హోంగార్డులు పరేడ్ మైదానాలకే పరిమితమయ్యారు. నవంబర్ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చారు.
వారిని పోలీసులు అడ్డుకోవడంతో, వారి భార్యలే ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శనివారం మధ్యా హ్నం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. హోంగార్డుల హెచ్చరికలతో అప్పటికే ఇందిరాపార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ధర్నా చేసేందుకు వచ్చిన హోంగార్డుల భార్యలను అడ్డుకున్నారు. దీంతో వారంతా ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక దోమలగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఆందోళనను పోలీసులు జిల్లాల్లోనే అడ్డుకోవడంతో హోంగార్డులు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలకు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. తక్షణం తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు తీర్చాలని వేడుకున్నారు.
తమ సంక్షేమం గురించి, జీత భత్యాలు, వేతన సవరణ గురించి పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు సిద్ధమైనట్టు హోంగార్డులు చెప్పారు. నాడు ప్రతిపక్షంలో హోంగార్డులను ఊరించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం వినతిపత్రాలు కూడా తీసుకునే సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ యూనిఫాం అలవెన్స్‌ను ఇవ్వాలని, ఆర్డర్లీ వ్యవస్థను తొలగించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, సాధారణ మరణానికి రూ.5 లక్షల నగదు ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2017లో తీసుకొచ్చిన ఎస్పీఏను అమలు చేయాలని, ఆర్డర్ టు సర్వ్ ద్వారా హోంగార్డులను తమ సొంత జిల్లాలకు పంపాలని కోరారు. ఇతర ఉద్యోగులతోపాటు హెల్త్‌కార్డులు ఇవ్వాలని హోంగార్డులు డిమాండ్ చేశారు. హోంగార్డులపై వేధింపులను ఆపాలని కోరారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు