బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న ఒవైసి 

బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న ఒవైసి 
బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయని, తాను నోరు విప్పితే ఆ పార్టీ​ నేతలు ఇబ్బంది పడతారని  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మొన్నటి వరకు ఆ పార్టీతో చెలిమి చేస్తూ, ప్రభుత్వంలో ఆధిపత్యం వహించిన ఒవైసి, ఇప్పుడు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్నారు. 
 
అంతేకాకుండా కాంగ్రెస్ చేపట్టిన వివాదాస్పద మూసీనది ప్రక్షాళనకు మద్దతు తెలుపుతూ, దానిపై విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ పై కన్నెర్ర చేశారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్​ఎస్​ నేతల విమర్శలను తిప్పికొడుతూ  మూసీప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళిక చేయలేదా? అంటూ ప్రశ్నించారు. ఆ ప్రణాళిక వద్దని తాను చెప్పలేదా? అని నిలదీశారు. 
 
ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? అంటూ బిఆర్ఎస్ నేతల నోరుమూసే ప్రయత్నం చేశారు.  మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పైగా, బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని హితవు చెప్పారు. 
 
2023 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం అహంకారం కారణంగానే బిఆర్ఎస్ ఓటమి చెందినట్లు చెప్పుకొచ్చారు.  ఆ పార్టీకి గతంలో తమ మద్దతుతోనే జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే మళ్లీ బీఆర్​ఎస్​యే అధికారంలోకి వచ్చేదని తెలిపారు
 
మరోవైపు ఇటీవలే హైడ్రాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ పరిధిలో ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. హుస్సేన్‌ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో బల్దియా భవనాన్ని నిర్మించారని, దాన్ని కూడా కూల్చివేస్తారా? అని నిలదీశారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని దాన్ని కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించారు.
 
కాగా, ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబు, డీఎంకే అంటున్నారని, అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే రాద్ధాంతం చేసేవారని ఒవైసీ పేర్కొన్నారు. దక్షిణ భారతంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని తెలిపారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, అసెంబ్లీ, లోక్​సభ స్థానాల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. బాగా పని చేసిన రాష్ట్రాలకు ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.