రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ను అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ను అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం

అధికారంలోకి రాగానే ప్రజాభవన్‌ వద్ద కంచెలు కూల్చి, ఇకపై ఆంక్షలు ఉండవంటూ హడావుడి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అన్ని వర్గాల ప్రజలలో చెలరేగుతున్న అసంతృప్తులను కట్టడి చేసేందుకు పోలీసులను నమ్ముకొని పరిస్థితి ఏర్పడింది.

ఇప్ప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా పలు జిల్లాల్లోనూ పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల మొత్తం పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్టు ఎస్పీ రూపేశ్‌ శుక్రవారం ఉత్తర్వులను జారీచేశారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 7 వరకు పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా 13 జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేసిందని చెప్తున్నా రు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 11 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిత్యకృత్యం అయ్యాయి. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు, ఉచిత బస్సు ప్రయణం, బతుకమ్మ చీరల ఆర్డర్‌ నిలిపివేత. ఇలా ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను ప్రభావితం చేసింది.  రుణమాఫీ చేయాలని, రైతుబంధు ఇవ్వాలని అన్నదాతలు, ఉపాధి కోల్పోయామంటూ ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, చదువుకునే సమయం ఇవ్వాలని నిరుద్యోగులు, రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయాలని విద్యార్థులు.. ఇలా నష్టపోయిన ప్రతి వర్గం ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.

చివరికి పోలీసులు సైతం రాష్ట్రంలో ధర్నాలు చేసే పరిస్థితి దాపురించింది.  రాష్ట్రంలో నిరసనలు తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తున్నది. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తారని, కాంగ్రెస్‌ నేతల ఇండ్ల వద్ద బైఠాయిస్తారని నివేదికల్లో స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఎక్కడికక్కడ నిర్బంధం అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం.

మొదటి నుంచీ ప్రభుత్వం చెప్తున్నదానికి, చేస్తున్నదానికి పొంతన ఉండటం లేదు. సచివాలయం గేట్లు ఓపెన్‌గా ఉంటాయని, ఎప్పుడైనా వచ్చి, ఏ మంత్రినైనా కలువొచ్చని మొదట్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ సచివాలయం వద్ద సాయంత్రం 3-5 గంటల మధ్య మాత్రమే పాస్‌లు ఇస్తున్నారు. లోపల ఆరో అంతస్థు, రెండో అంతస్థులో ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్దకు వెళ్లేందుకు బారికేడ్లను అడ్డుపెట్టారు. ఇంటి వద్ద, ఇటు సచివాలయంలో బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. నిరసనలు హోరెత్తుతుండటంతో సచివాయలం, సీఎం నివాసం చుట్టూ 2 కిలోమీటర్ల మేర 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.  సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బందికి రక్షణ బాధ్యతలు అప్పగించారు.  గతంలో సచివాలయానికి ఎస్పీఎఫ్‌ బలగాలే బందోబస్తు నిర్వహించేవి. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ బాధ్యతను స్పెషల్‌ పోలీసులకు (టీజీఎస్పీ) అప్పగించారు.

 

ఇటీవల ఏక్‌ పోలీస్‌ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే పరువు పోవడంతోపాటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, కార్యాలయం, తాజాగా సచివాలయాన్ని ఎస్పీఎఫ్‌ పరిధిలోకి తీసుకెళ్లింది