ఢిల్లీలో దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300కి పైనే నమోదవుతోంది.

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సఫర్) సంస్థ ప్రకారం ఇది చాలా ఆధ్వాన్నమైన స్థాయిలో ఉన్నట్లు. ఈ కారణంగా ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రజలు విష వాయువులను పీల్చుకుంటున్నారు. తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి.

దీని కారణంగా ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంత ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను నివేదించినట్లు ఓ సర్వే తాజాగా వెల్లడించింది. 69 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గొంతునొప్పి, దగ్గుతో సహా కాలుష్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సదరు సర్వే నివేదించింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో 21 వేల కంటే ఎక్కువ మందిపై సర్వే చేసింది.

పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా 62 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కళ్ల మంటలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. 46 శాతం మంది ముక్కు కారటం వంటి సమస్యలు నివేదించారు. ఇక 31 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమా ఉన్నట్లు తెలిపారు. మరో 31 శాతం మంది తలనొప్పిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

23 శాతం మంది ఏకాగ్రతను కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేయగా, 15 శాతం మంది నిద్రపోతున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. అయితే, 31 శాతం మంది మాత్రం కాలుష్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులనూ నివేదికంకపోవడం విశేషం. రాజధాని వాసులు చాలా మంది ఇప్పటికే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రోన్కైటిస్‌ క్రానిక్‌, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది.

రానున్న రోజుల్లో ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు మరింత దిగజారే అవకాశం ఉందని సదరు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇదే సర్వే రాజధానిలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నారని ఢిల్లీ వాసులను ప్రశ్నించింది. 10,630 మందిలో 15 శాతం మంది ఈ సీజన్‌లో నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

మరో 9 శాతం మంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహారాలు, పానీయాలు తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలనుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు. మరో 23 శాతం మంది ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నారు. కొందరు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరికొందరు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే.

పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.