ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయని రేవంత్

ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయని రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ మండిపడ్డారు. 

సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తామని అన్నారని ఆమె గుర్తు చేశారు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదని, కేంద్రం నిధులు లేకుండా ఇళ్లు కడతారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదని, సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ పథకం ఎత్తేసామని అంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని, అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్‌కు సిగ్గు ఉండాలని అరుణ తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలను ఎత్తి చూపారని పేర్కొంటూ రూ.500 సిలిండర్‌లలో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.375, మరి మీరిచ్చేది ఎంత? అని ఆమె ప్రశ్నించారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అన్ని కేంద్రానీవే కదా అని మాజీ మంత్రి నిలదీశారు. 

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారని అరుణ ధ్వజమెత్తారు. కానీ ప్రజలు మేల్కొన్నారని, దీన్ని అర్థం చేసుకుంటారని ఆమె హెచ్చరించారు. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు, కూలీలకు సాయం దిక్కు లేదని ఆమె విమర్శించారు. కాలేజీ చదివే అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే? అని ఆమె ప్రశ్నించారు. 

11 నెలల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్ అని చెబుతూ  రూ.10 లక్షల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి, ఎక్కడెక్కడ చేయించారో బయట పెట్టాలని ఆమె  డిమాండ్ చేశారు. చెప్పిన మాట నిలబెట్టు కోకుండా దబాయించాలని చూస్తున్నారని ఆమె చెప్పారు. కొత్తగా ఒక పింఛను దరఖాస్తు కూడా తీసుకోలేదని, కొత్త వితంతు పింఛన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.