ప్రతిపక్షాల నుండి, పర్యావరణ నిపుణుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజలను సమీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలకు సిద్ధమయ్యారు. నవంబర్ 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
తన జన్మదినాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం “మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర” పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను వాడపల్లి నుంచి ప్రారంభించనున్నారు.
ఈ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు సాగనుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే.. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఇప్పటికే ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేయనున్న పాదయాత్రకు కలిసి రావాలని సవాల్ చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామంటూ చెప్పారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?