హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం
 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వచ్చాక హామీల అమలు విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందిని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోర వైఫల్యం చెందిందని ఆయన ధ్వజమెత్తారు.
అనేక రకాల వాగ్ధానాలు ఇస్తూ, ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా అటకెక్కిస్తూ పచ్చి మోసం చేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు.  ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న అన్న చందంగా  డిక్లరేషన్లు, గ్యారంటీల, మేనిఫెస్టోల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను గారడీ చేసే ఓట్లు దండుకుని మోసం చేసిందని విమర్శించారు.

కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో దివాళాకోరు, దగాకోరు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే నిదర్శనం అని స్పష్టం చేశారు.  మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు, గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చారు. మరి అమలులో ఎక్కడికి పోయాయి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తకావొస్తోందని చెబుతూ ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా, ఏ విధంగా అమలు చేస్తారనే సమాధానం ప్రభుత్వం నుంచి రావడం లేదని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అంతులేని హామీలు.. అమలుకు నోచుకోని, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ మోసపూరిత వైఖరిని అవలంభిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్రాలు దివాళాతీస్తే విద్య, వైద్యం, సంక్షేమం దెబ్బతింటాయి. నష్టపోయేది పేదవారు, సామాన్యులే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని కేంద్ర మంత్రి హితవు చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్ .., లీటర్ పాలకు బోనస్,  ఆవు పేడ కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకు రూ. 1500… ఇలా అనేక రకాల హామీలు ప్రకటించి అమలు చేయకుండా మోసం చేశారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలోనూ సరిగ్గా అమలు చేయలేమని, దానిపై పునరాలోచన చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. జెన్ కో, ట్రాన్స్ కో లకు ఇవ్వాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు.

లీటర్ పాలకు 5 నుంచి 7 రూపాయల సబ్సిడీ అని చెప్పి ఇవ్వడం లేదని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ రేట్స్ -టర్మ్స్ క్యాష్ తో అవినీతి విలయతాండవం చేస్తోందని ఆరోపించారు.  అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి భార్య 14 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవినీతి పరాకాష్టకు చేరుకోవడమే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

హిమాచల్ ప్రదేశ్, కర్నాటక లో కాంగ్రెస్ నాయకులు అవినీతితో బరితెగిస్తున్నారని, మరోవైపు, తెలంగాణలో అమలుకు నోచుకోని గ్యారంటీలు, అనేక రకాల హామీలు ఇచ్చి అమలు చేయకుండా బుకాయింపులు చేస్తున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర పరిస్థితి మరింత దయనీయంగా మారిందని తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పేరుతో రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలపై యువత ప్రశ్నిస్తే.. పరుగులు పెట్టే విధంగా లాఠీలతో దాడి చేయిస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత ఆకలికేకలు పెడుతుంటే, వారి నిరసనలను పోలీసు లాఠీలతో అత్యంత దారుణంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అశోక్ నగర్ ను పోలీసు నిర్భంధంలో పెట్టారని చెప్పారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ నిలువునా ముంచి 7 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేయగా, కాంగ్రెస్ సంవత్సరం తిరగకుండానే లక్ష కోట్ల రూపాయల అప్పుచేస్తుందని తెలిపారు. 
 
గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబ పెత్తనం.. బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ పెత్తనం.. ఆ పార్టీల్లో ఆయా కుటుంబాలు అవినీతికి పాల్పడి, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు.