కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు

కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు

* జార్ఖండ్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ నిప్పులు..!

కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఏనాడూ గిరిజనులను గౌరవించలేదని ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల గౌరవం, హుందాతనానికి నిలువెత్తు సాక్షి జార్ఖండ్, భారత స్వాతంత్ర్యం, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంలో గిరిజనుల ధైర్య సాహసాలే కీలక పాత్ర పోషించాయని కొనియాడారు.
 
‘గిరిజనులకు ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద శత్రువులు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీలకు జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) మద్దతు పలుకుతుంది’ అని మోదీ ఆరోపించారు. ‘గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాల్చి చంపింది. నిరంకుశ ఇంగ్లిష్ పాలకులకు కొల్హాన్ విసిరిన సవాల్‌కు చరిత్రే సాక్షి. ఈనాడు నిరంకుశ జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కొల్హాన్ మరోసారి సిద్ధమైంది’ అని ధ్వజమెత్తారు.
 
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ గెలుపుపై ఇప్పటికే నమ్మకం కుదిరిందని ఆయన చెప్పారు.

‘‘ ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి ఇక్కడి వచ్చాను. ఇది నాకు రెండవ ఎన్నికల ర్యాలీ. ఈ రెండు ర్యాలీలు చూసిన తర్వాత.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సగాని కంటే ఎక్కువ సీట్లను బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని నేను నమ్మకంతో చెప్పగలను’’ అని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. 

గిరిజన సోదర, సోదరీమణుల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ఏవిధంగా పనిచేస్తోందో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక కేంద్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన సమాజం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు. ఇక రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ధరలు తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక చట్టవిరుద్ధంగా గిరిజన కూతుళ్ల నుంచి గుంజుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

గిరిజన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్ల ఆత్మ గౌరవమే బీజేపీకి అత్యంత ముఖ్యమైనదని మోదీ స్పష్టం చేశారు. అందుకే తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గిరిజనుల కోసం రాష్ట్రాన్ని ఇచ్చామని తెలిపారు. ఢిల్లీ నుంచి పని చేసే అవకాశం అటల్ బిహారీ వాజ్‌పేయికి దక్కిందని, ఆయన హయాంలోనే గిరిజన రాష్ట్రాలు ఏర్పడ్డాయని మోదీ గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు వాజ్‌పేయి హయాంలోనే ఏర్పాటు అయ్యాయని మోదీ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర గుర్తింపును మసక బార్చుతున్నారని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ గుర్తింపు మార్చివేసే కుట్ర జరుగుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారులకు జేఎంఎం-కాంగ్రెస్- ఆర్జేడీ మద్దతిస్తున్నాయని విమర్శించారు. 

‘‘చొరబాటుదారులే వారి అతిపెద్ద ఓటు బ్యాంక్. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు చొరబాటుదారుల కోసం ఫేక్ సర్టిఫీకేట్లు తయారు చేస్తున్నాయి. గిరిజన ఆడబిడ్డలను చొరబాటుదారులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆడ కూతుళ్ల నోటి కాడ కూడు, భూమి లాక్కుంటున్నారు. అంతేకాదు జేఎంఎం, కాంగ్రెస్ కూటమి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్లను ప్రకటిస్తున్నాయి. ఈ విద్యా సంస్థల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతున్నాయి’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.