సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది

సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలకు విలువ లేకుండా పోయిందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి, బిజెపి నేత బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఇక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని, ఆ పార్టీ క్యాడర్ పోయిందని, లీడర్లు గోడలు దూకుతున్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలను అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం యూఎస్‌లోని “ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” ఎన్నారైలతో జరిగిన ఆన్‌లైన్ మీట్లో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయని, ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోందని, ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఆరోపించారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాటవేస్తోందని ధ్వజమెత్తారు.

సీఎం హామీ ఇస్తే వెంటనే అమలు చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని విమర్శించారు. 

రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. జాతీయవాద వ్యతిరేక భావజాలమున్న వాళ్లను, నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, వీరంతా మన దేశ చరిత్రను, వివేకానందస్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునే వాళ్లేనని పేర్కొన్నారు.

 కమ్యూనిజం, నక్సలిజంకు సానుకూలంగా ఉన్నవాళ్లేనని, అలాంటి వాళ్లతో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలని కోరారు. ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశారంటే హిందూ ధర్మంపై ఏ విధమైన దాడి జరుగుతుందో, పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలని హెచ్చరించారు.

దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రభుత్వ ఏర్పాటు చేయడం తథ్యం అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఆలయాలను తీర్చిదిద్దుతామని, ఆదాయం కోసం కాకుండా హిందూ ధర్మం, ధార్మికత, భక్తి భావం పెంపొందేలా ఆలయాల్లో సేవలందిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.