కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీల తో ప్రజలను మభ్యపెట్టడానికే పరిమితమైందని, ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అమలు చేయడానికి ఆసాధ్యమని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం వెంబడి ప్రచారం హామీలు గుప్పిస్తూనే ఉందని మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా విమర్శించారు. అయితే కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పథకాల అమలు, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ తాజాగా వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బడ్జెట్‌కు అనుగుణంగా హామీలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ యూనిట్లకు సూచలను ఇచ్చిన వెంటనే ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. తాము ఎన్నటికీ అమలు చేయలేమని తెలిసినా హామీలు ఇస్తారు. కానీ, ఈసారి ప్రజల ముందు ఘోరంగా బయటపడ్డారు’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా చూడండి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. బ్యాడ్ నుంచి వరెస్ట్‌కు చేరాయి. వాళ్లు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరలేదు. ఆ రాష్ట్రాల ప్రజలు భయంకరంగా మోసపోయారు. ఇలాంటి రాజకీయాల వల్ల బలయ్యేది సామాన్యులే. పేదలు, యువకులు, రైతులు, మహిళలు ఈ వాగ్దానాల ప్రయోజనాలను పొందలేకపోవడమే కాదు.. వారికి ఇప్పటికే అందుతున్న పథకాలను కూడా నీరుగార్చే దుస్థితి వచ్చింది’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
”కాంగ్రెస్ పార్టీ అసాధ్యం కాని హామీలు తేలిగ్గా ఇవ్వడం నేర్చుకుంది. తాము ఇచ్చే హామీలు ఎప్పటికీ నెరవేరని తెలిసి కూడా ఒక ప్రచారం తర్వాత మరో ప్రచారంలో తప్పుడు హామీలు ఇస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రజల ముందు వారి డొల్లతనం బయటపడింది” అని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్థిక ఆరోగ్యం, అభివృద్ధి పథం అనేవి దయనీయ పరిస్థితికి చేరుకున్నాయని ప్రధాని చెప్పారు.
హామీలు అమలుకు నోచుకోలేదని, ఇది ఆయా రాష్ట్ర ప్రజలను దారణంగా మోసగించడమేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయాలకు పేదలు, యువకులు, రైతులు, మహిళలు బాధితులుగా మారానని, చివరకు అమలులో ఉన్న పథకాలను కూడా నీరుగారిపోతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తప్పుడు హామీల సంస్కృతి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హర్యానా ప్రజలు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ డొల్ల హామీలను తిప్పికొట్టి సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని మూడోసారి గెలిపించారని మోదీ గుర్తుచేశారు.
‘సాధ్యంకాని వాగ్దానాలను చేయడం సులభమే కానీ.. వాటిని అమలు చేయడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రహిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వాళ్లు అసాధ్యమైన హామీలను ఇస్తున్నారు. అసాధ్యమని తెలిసినా వాగ్దానాలు చేస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీ రాసుకొచ్చారు. #FakePromisesOfCongress అనే యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
వరుసగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రపై కన్నేసింది. ఏక్‌నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్రలో కిందటిసారి అనూహ్యంగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కూటమి (మహా వికాస్ అఘాడి)గా ఏర్పడి పోటీ చేస్తుంది. కర్ణాటక, తెలంగాణలో ఓటర్లను ఆకర్షించిన పథకాలనే ప్రధాన అస్త్రాలుగా మలచుకొని ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించాలని భావిస్తోంది.
ఇలాంటి తరుణంలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ కూటమి పేరు) నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ‘పొరుగు రాష్ట్రం తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాది కావొస్తున్నా, వాటిని అమలు చేయలేకపోయింది’ అని బలంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎత్తేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇవన్నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్లు ప్రధాని మోదీ చేసిన విమర్శలు ఆ పార్టీ నేతలను మరింత గందరగోళంలో పడేశాయి.
అంతకు ముందు, జ్రాగ్రత్తగా పరిశీలించే హామీలు ఇవ్వాలని, ఎలాంటి ప్రణాళిక లేకుండా హామీలు ప్రకటించడం పలు ఆర్థిక సమస్యలు తలెత్తి, భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పార్టీ విభాగాలను ఖర్గే హెచ్చరించారు. ఒకేసారి 5,6,10, 20 అంటూ హామీలు ఇవ్వవద్దని, బడ్జెట్ ప్రాతిపదికగానే హామీలు ప్రకటించాలని హితవు చెప్పారు. లేదంటే దివాళా తప్పదని స్పష్టం చేశారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం