బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం !

బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. మూసీ నదికి గోదావరి జలాలను తీసుకుచ్చి లక్ష్యాన్ని చేరుకునే దిశగా కసరత్తు పూర్తయింది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి లంగర్‌ హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పునాది రాయి వేయడం ద్వారా చర్యలు పుంజుకోనున్నాయి.  ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను సైతం అధికారులు వేగవంతం చేశారు.

గాంధీ సరోవర్‌గా బాపూఘాట్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా బాపూఘాట్ వ ద్ద బ్రిడ్జి కం బ్యారేజీతో పాటు గాంధీ ఐ డియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నమూనా లు, డిజైన్‌లపై చర్చలు, విస్తృత సంప్రదింపులను ప్రభుత్వం చేపడుతోంది. బాపూఘాట్‌ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో టెండర్లను పిలవడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ విగ్రహం ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది.  ఈ ఎత్తైన గాంధీ వి గ్రహంతో పాటు అక్కడ ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం. దానికి సంబంధించిన నమూనాలు, డిజైన్‌లపై విస్తృతంగా మేధావులతో సంప్రదింపులు చేస్తోంది.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభు త్వం నిర్ణయించింది. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలు ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్ గా గాంధీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ యోచిస్తున్నారు.

అంతేకాక, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా, సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాపూఘాట్‌ దగ్గర ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఎస్టీపీలకు రూ.7వేల కోట్లతో టెండర్లు పిలవడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమవడం ద్వారా మూసీ నది పునరుద్ధరణకు కొత్త వెలుగులు తేవడమే కాకుండా, నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించడం కూడా సాధ్యమవుతుందని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ భావిస్తోంది.