త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రానున్నాడని, అది కూడా డిసెంబర్‌లోపే వస్తాడంటూ బీజేపీ శాసన సభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏడు నెలల నుంచి తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదని, దూరం నుంచి చూసి వచ్చారని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని, ఊరికే మాట్లాడనంటూ చెప్పుకొచ్చారు. అయితే 2025 సంవత్సరంలో జూన్ నుంచి డిసెంబర్‌లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు.
అయితే మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అందులో రేవంత్ రెడ్డి అవినీతి ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించిందని, అందుకోసమే ప్రక్షాళన చేపట్టారని మహేశ్వర్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. అందుకే కాంగ్రెస్ రేవంత్‌ను దూరం పెడుతోందని ఆరోపణలు గుప్పించారు. సీఎం ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, దీన్ని అధిష్టానం కూడా నమ్ముతోందని చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎజెండాకు కారణం ఏంటని పార్టీ అధిష్ఠానం కూడా ఆరా తీసిందంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మూసీ అంశంపై పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు నేరుగా సోనియా గాంధీకి పరిస్థితి వివరించి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకొచ్చారు. రంగంలోకి దిగిన సోనియా గాంధీ డీకే శివకుమార్‌కు చెప్పి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కనుక్కోమన్నారని, కానీ డీకే ఫోన్ కూడా రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేయలేదంటూ కీలక కామెంట్లు చేశారు. దీన్ని రేవంత్ రెడ్డే స్వయంగా చిట్ చాట్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
ఏఐసీసీకి వస్తున్న ఫిర్యాదులు, గమనిస్తున్న తీరును చూస్తే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అని పార్టీ ఆలోచిస్తోందంటూ మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కోసం రేసులో ఉన్న ముగ్గురు సీనియర్ మంత్రులు తెలంగాణలోని పరిస్థితులను అధిష్ఠానానికి పూస గుచ్చినట్టు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదంతా గ్రహించిన రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని, తన నాలుకపై మచ్చలున్నాయని చెప్పినట్టుగా గుర్తుచేశారు. ఇదే క్రమంలో మహేశ్వర్ రెడ్డి పలు సంచలన విషయాలు తెలపగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు