తెలంగాణాలో రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం

తెలంగాణాలో రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం

తెలంగాణలో  ఏటా యాదవులు అట్టహాసంగా జరుపుకునే సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను శాంతి కుమారి ఆదేశించారు.

కాగా ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాద్‌లో యాదవ సోదరులు.. సదర్ సమ్మేళనం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. పెద్ద పెద్ద దున్నలు ఈ సదర్ సమ్మేళనంలో సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సదర్ ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించేందుకు యాదవులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే శనివారం సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈరోజు నిర్వహించనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరు పొందిన దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే “గోలు 2” అనే ముర్రా జాతి దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు ముస్తామైంది.
తెలుగు రాష్ట్రాల్లోని దున్నరాజులు కూడా ఈ సదర్‌ ఉత్సవాల్లో తమ రాజసాన్ని చూపేందుకు రంగంలోకి దిగనుండటం విశేషం.

గతంలో బాహుబతి దున్నలు హైదరాబాద్‌లో కనువిందు చేశారు. దున్నపోతులకు పూల దండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో అందంగా రెడీ చేసి మెయిన్ సెంటర్లు, ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన డవక్-దన్కీ-దన్ స్పెషల్ బ్యాండ్ తో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు.

దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్యాన్సులు చేయిస్తారు. ఇది సదర్ కు స్పెషల్ అట్రాక్షన్. పెద్ద ఎత్తున యువతతోపాటు చిన్నా పెద్దా అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ పండగను జరుపుకుంటారు.

సదర్ సమ్మేళనం దృష్ట్యా  హైదరాబాద్ పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణాలు చేసే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని నగర పోలీసులు సూచించారు.