ఐడీఎఫ్‌ దాడుల్లో హమాస్ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ హతం

ఐడీఎఫ్‌ దాడుల్లో హమాస్ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ హతం

* తూర్పు లెబనాన్‌పై దాడుల్లో 52 మంది దుర్మణం

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హమాస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్‌ దళాలు అంతమొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌  ఇజ్ అల్-దిన్ కసబ్‌ను కూడా ఐడీఎఫ్‌ హతమార్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తాజాగా ధ్రువీకరించింది.
హమాస్‌ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేత, హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ ఆర్మీ (ఐడీఎఫ్‌) ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్‌ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్‌ తెలిపింది. అతడు వెళుతున్న కారుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో కసబ్‌ చనిపోయాడని హమాస్‌ వర్గాలు ధ్రువీకరించాయి.

తాము జరిపిన వైమానికి దాడుల్లో కసబ్‌తోపాటు ఆయన సహాయకుడు అయ్‌మన్ అయేష్ కూడా హతమైనట్టు ఐడీఎఫ్‌ పేర్కొంది. మరోవైపు కసబ్‌ మృతిని హమాస్‌ కూడా ధ్రువీకరించింది. ఆయనతోపాటు మరో అధికారి కూడా మరణించినట్టు తెలిపింది. అయితే, ఐడీఎఫ్‌ చెబుతున్నట్టు కసబ్‌ హమాస్‌లో అత్యధిక ర్యాంకులో లేడని, స్థానిక గ్రూపు అధికారి మాత్రమేనని స్పష్టం చేసింది.

కాగా, ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడుల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు. లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

మరోవైపు హెజ్బొల్లా బలగాలు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది గాయపడినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య మొదలైన పోరులో హెజ్బొల్లా తలదూర్చింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడటంతో.. ఇజ్రాయెల్‌ అటు గాజాలోని హమాస్‌తోపాటు, లెబనాన్‌లోని హెజ్బొల్లాతో యుద్ధం చేస్తోంది.