ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన దేశంలో అధ్యక్ష ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 7 కోట్ల మంది అమెరికన్లు వివిధ ఓటింగ్ కేంద్రాల్లో ముందస్తుగా ఓటు వేశారు. కీలకమైన తుది ఓటింగ్ మంగళవారం (నవంబరు5) జరగనుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలిచారు.
అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఇద్దరు మధ్యా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. శుక్రవారం ఇరువురు నేతలు విస్కాన్సిన్‌లో తుది ప్రచారం నిర్వహించడం విశేషం. ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో అని అటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
అమెరికా చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత ఉత్కంఠ భరిత పోటీ గతంలో ఎన్నడూ జరగలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.
మంగళవారం 5వ తేదీన పోలింగ్ జరిగినప్పటికీ అధ్యక్షునిగా ఎన్నికైన వారు 2025 జనవరి 20 తర్వాతే బాధ్యతలు చేపడతారు. హారిస్ జూలై చివరిలో పోటీలోకి ప్రవేశించినప్పటి నుండి జాతీయ పోలింగ్ సగటులలో ట్రంప్‌పై స్వల్ప ఆధిక్యాన్ని పొందుతూనే ఉన్నారు. హారిస్ తన ప్రచారం మొదటి కొన్ని వారాల్లో తన పోలింగ్ సంఖ్యలలో బౌన్స్‌ను చూసింది ఆగస్టు చివరి నాటికి దాదాపు నాలుగు శాతం పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది.
సెప్టెంబరు, అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. అయితే గత రెండు వారాల్లో అవి మరింత కఠినతరంగా మారాయి. ప్రస్తుతం ఆమెకు 48 శాతం మద్దతు లభిస్తుండగా, ట్రంప్ కేవలం 1 శాతం మాత్రమే వెనుకబడి ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థుల తలరాతను ముఖ్యంగా అమెరికాలోని ఏడు రాష్ర్టాలు నిర్ణయిస్తాయి. జార్జియా, మిషిగన్ సహా ఏడు రాష్ర్టాల్లో ఆధిక్యం పొందిన వారే అధ్యక్షుడవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెన్సిల్వేనియాలోని 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచాయని గత అధ్యక్ష ఎన్నికలు రుజువుచేసినట్టు టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది. 2024 ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రం ఓట్లు కీలకంగా ఉన్నాయని తెలిపింది. కాగా, 2020 ఎన్నికల్లో జో బైడెన్‌కు స్వల్ప ఆధిక్యం ఇచ్చి ట్రంప్‌కు త్రుటిలో అధికారాన్ని చేజార్చిన ఆరిజోనా, జార్జియా, విస్కోన్సిన్, నెవాడా ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ ప్రాంతంలో ఒపీనియన్ పోల్స్ గురించి పరిశీలిస్తే కమలా హారిస్‌కు నెవాడా, నార్త్ కరోలినాల్లో స్వల్ప ఆధిక్యం ఉండగా, ఆరిజోనాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇద్దరి మధ్య పోటాపోటీ నడుస్తున్నది. ఈ ఏడు రాష్ర్టాల్లో ఎవరికి ఆధిక్యం వచ్చినా 3.5 శాతం తేడాయే ఉంటుందని అంచనా.
ఏడు స్వింగ్ స్టేట్స్‌కు గాను ఆరింటిలో ట్రంప్‌దే పైచేయిగా ఉన్నట్టు అట్లాస్ తాజా పోల్ సర్వే పేర్కొనగా, ఇద్దరి మధ్యచాలా గట్టి పోటీ నెలకొన్నట్లు న్యూయార్క్‌టైమ్స్ సర్వే పేర్కొంది. తుది ఓటింగ్‌కు మరో 24 గంటల్లో తెర లేవనుండడంతో కమలా హారిస్ (డెమొక్రాటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. కీలకమైన సమస్యలను ఎజెండాపైకి రానీయకుండా వ్యక్తిగత ధూషణలు, ఊక దంపుడు ఉపన్యాసాలతో ప్రచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన