జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ నియోజకవర్గం నుంచి దాఖలు చేసిన నామినేషన్ వివాదంపై దారితీసింది. ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న వయస్సులో వ్యత్యాసాలపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. అఫిడవిట్ ప్రకారం, సోరెన్ వయస్సు ఐదు సంవత్సరాల కాలంలో ఏడేళ్లు పెరిగింది. 2019 నామినేషన్‌లో, ఆయన వయస్సు 42 సంవత్సరాలుగా పేర్కొనగా, అయితే ఈ సంవత్సరం 49గా తెలపడం వివాదంకు దారితీసింది. సోరెన్ వయస్సులో తేడాలున్నాయని ఆరోపిస్తూ ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.
ఐదేళ్ల వ్యవధిలో ఒకరి వయసు ఏడేళ్లు ఎలా పెరుగుతుందని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాహదేవో ప్రశ్నించారు. పైగా, సోరెన్ ఆదాయం రూ. 10 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గడంపై బిజెపి విస్మయం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌లో అనేక ఆస్తులను వెల్లడించలేదని పేర్కొంది. మరోవైపు ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
కాగా, జేఎంఎం వ్యవస్థ మొత్తం నకిలీదని అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కో-ఇంఛార్జి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. ‘‘అఫిడవిట్‌లో ఉన్న వారి ఆస్తుల వివరాలను పరిశీలిస్తే వారి వయసు కూడా పెరిగిపోయింది. ఇది చొరబాటుదారుల ప్రభుత్వం. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరికీ భద్రత ఉండదు” అంటూ విమర్శించారు.
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడం జార్ఖండ్‌లోని ప్రజల బాధ్యత అని ఆయన పిలుపిచ్చారు. గిరిజన వర్గాల ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అన్సారీపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.
ఈ వివాదంపై స్పందిస్తూ, జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్‌ను సమర్థించింది. బిజెపి చర్యలు వారి నిరాశను వెల్లడి చేస్తున్నాయని ఆ పార్టీ నాయకుడు మనోజ్ పాండే చెప్పారు. నామినేషన్ కోసం దాఖలు చేసిన అన్ని పత్రాలు ధ్రివీకరణ గలవే అని చెబుతూ బిజెపి ఆరోపణలను “నిరాధారమైనవి” అని కొట్టిపారేశారు. అఫిడవిట్‌పై బిజెపి దృష్టి పెట్టడం “జార్ఖండ్‌లో ఘోర ఓటమి భయం” చూపుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవంక, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పందిస్తూ, భారతీయ జనతా పార్టీ చేసిన ఆరోపణలను “మళ్లింపు వ్యూహం” అని కొట్టిపారేశారు. దృష్టి మరల్చేందుకు వారు (బీజేపీ) కొత్త అంశాలను తెరపైకి తెస్తారని పేర్కొంటూ తాము గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి