తీవ్ర తుఫానుగా మారిన దానా

తీవ్ర తుఫానుగా మారిన దానా
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాపై భారత వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌ అందించింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 గంటల వరకు పారాదీప్‌ కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో, సాగర్‌ ద్వీపానికి 310 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. 
 
ఉత్తర, వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల మధ్యనున్న పూరీ, సాగర్‌ ద్వీపం మధ్య భితార్కనికా, ధమర దగ్గరలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున తుఫాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 100 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో
గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. 
 
తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఉంటుందని ఐఎండీ డీజీ డాక్టర్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర పేర్కొన్నారు. తుఫాను తీరం దాటాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని.. దాని ప్రభావంతో దక్షిణ జార్ఖండ్‌లోనూ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 
 
గురు, శుక్రవారాల్లో జార్ఖండ్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. ఇక తీవ్ర తుఫాను నేపథ్యంలో పూరీ బీచ్‌లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచి పర్యాటకులతో పాటు స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రక్‌ జిల్లాలో బలమైన గాలులు వీస్తున్నాయి. 
 
మరోవైపు పు తుఫాను నేపథ్యంలో భారత నావికాదళం మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. నౌకాదళ కమాండ్‌ ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్‌ అధికారులతో కలిసి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నది. నేవీ సహాయ కార్యక్రమాల్లో సహాయం అందించనున్నారు. అలాగే, అవసరమైతే ఆరోగ్య సేవలను అందించనున్నది.
ఒడిశాలోని పూరీ-సాగర్‌ ద్వీపం మధ్య భితర్‌కనికా-ధమ్రా సమీపంలో తుపాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ‌్యంలో కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. బుధవారం సాయంత్రానికే 3 లక్షల మందిని తరలించినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. మరో ఏడు లక్షల మందిని తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 14 జిల్లాల నుంచి 10 లక్షల 60 వేల మందిని తరలించాలని ఒడిశా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఎన్​డీఆర్​ఎఫ్ సహా విపత్తు నిర్వహణ బృందాలను 14 జిల్లాల్లో మోహరించారు.