170 విమానాలకు బాంబు బెదిరింపులు.. రూ 600 కోట్ల నష్టం

170 విమానాలకు బాంబు బెదిరింపులు.. రూ 600 కోట్ల నష్టం
 
* హైదరాబాద్‌ సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌కు బెదిరింపు
 
ఫోన్‌లు, ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బాంబు బెదిరింపులతో దేశంలో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు భద్రతా సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 
 
బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హెచ్చరించినప్పటికీ దుశ్చర్యలు ఆగడం లేదు. గత తొమ్మిది రోజుల్లోనే 170 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  ‘విమానంలో బాంబు పెట్టాం’ అని దుండగులు, ఆకతాయిలు పంపిస్తున్న హెచ్చరికలతో విమానాశ్రయాల్లో హైరానా నెలకొంటున్నది. 
 
ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్‌, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే. దీంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సి వస్తున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. 
 
గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు దాదాపుగా రూ. 600 కోట్లు నష్టపోయి ఉంటాయని గతంలో ఓ విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ఒక డొమెస్టిక్‌ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుందని, అంతర్జాతీయ విమానానికి ఇది దాదాపు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. విమానాలకు వస్తున్న బెదిరింపులన్నీ నకిలీవే. ఇంతకుముందు అడపాదడపా ఇలాంటి బెదిరింపులు వచ్చేవి. ఇవి చాలావరకు ఆకతాయిలు చేసే పనులే అయి ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒకేసారి పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తుండటంతో కుట్రకోణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ హెచ్చరించాడు.

దేశంలో విమానయాన రంగానికి ఆటంకం కలిగిస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చి ఎప్పడూ విమానాలు ఎక్కకుండా నిషేధించాలని విమానయాన శాఖ భావిస్తున్నది. దీంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిని వారెంట్‌ లేకుండా అరెస్టు చేసేలా సప్రెషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ యాక్ట్స్‌ అగైనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌(స్వాస్కా చట్టం)-1982కు సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.

కాగా, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పంచకుల(హర్యానా), రాంపూర్‌(ఉత్తరప్రదేశ్‌)లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.

అవి ఉత్తుత్తివని తేలడంతో మంగళవారం ప్రశాంతంగా తరగతులు జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, దుండగుడు పంపిన ఈమెయిల్‌లో తమిళనాడు రాజకీయాల గురించి, ఉద్వాసనకు గురైన డీఎంకే కార్యకర్త జాఫర్‌ సాదిక్‌ గురించి ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.