దానా తుపాన్ హెచ్చరికలతో 150కు పైగా రైళ్లు రద్దు

దానా తుపాన్ హెచ్చరికలతో 150కు పైగా రైళ్లు రద్దు
తూర్పు – మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా ఏర్పడినట్లు తెలిపారు.

ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిన తరువాత, ఈ నెల 23వ తేదీన తూర్పు- మధ్య బంగాళాఖాతంలో తుపాన్​గా ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీన ఉదయానికి తీవ్ర తుపాన్​గా ఉద్ధృతి చెంది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాన్ని 24వ తేదీన రాత్రి, 25న ఉదయం పూరీ, సాగర్ ఐలాండ్స్ మధ్య దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

‘దానా’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రయాణీకుల భద్రత నిమిత్తం 150కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లన్నీ అక్టోబర్ 23 నుంచి 25 తేదీల మధ్య ఆగ్నేయ రైల్వే పరిధిలో నడవనున్నాయని వివరించింది.

దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపై కూడా ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం ఇవాళ బలహీనపడిట్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 

అనంతపురం జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధిక వరద పోటెత్తడంతో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. దీంతో అనంతపురంలోని పండమేరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఈ క్రమంలోనే అనంతపురం గ్రామీణ పరిధిలోని కళాకారుల కాలనీ, అంబేడ్కర్​ కాలనీ, ఉప్పరపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు నీట మునిగాయి. 

దీంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 అడుగుల మేర వరద నిలిచిపోవడంతో వారు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో భారీగా ట్రాఫిక్​ జామ్ ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల నుంచి వచ్చే వాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం హైదారాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.