రాజధాని అమరావతికి కేంద్రం గ్రాంటుగా రూ 15,000 కోట్లు

రాజధాని అమరావతికి కేంద్రం గ్రాంటుగా రూ 15,000 కోట్లు
రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట లభించింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15,000ల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. ఆ మొత్తాన్ని అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వమే రుణంగా తీసుకొని, రాష్త్ర ప్రభుత్వంకు ఈ మొత్తాన్ని గ్రాంటుగా ఇవ్వనున్నది.

ఆ మొత్తంలో సుమారు రూ.13,440 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని, సీఆర్​డీఏకు ఇవ్వనుంది. ఆ రెండు బ్యాంకులూ చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇస్తున్నాయి. రూ.15,000ల కోట్లలో బ్యాంకులు ఇచ్చేది పోగా మిగతా మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది. బ్యాంకులకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది.

అమరావతి కేపిటల్ సిటీ డెవలప్​మెంట్​ ప్రొగ్రాం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆ రుణం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాల్ని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచింది.  కేంద్ర ఆర్థికశాఖను రుణ గ్రహీతగా, సీఆర్​డీఏను ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా ప్రపంచ బ్యాంకు అందులో పేర్కొంది. ‘ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ ” విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు తెలిపింది.

ఈ లెక్కన రూ.15,000ల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి రూ.15,000ల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి గ్రాంట్‌గానే వస్తోందని స్పష్టమవుతోంది.