తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జకియా ఖానంపై ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. ఆరు టిక్కెట్లను రూ.65 వేలకు విక్రయించారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం కోసం ఎమ్మెల్సీ ఖానం సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్టు భక్తుడు తెలిపాడు. అధిక ధరకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అదికారులు విచారణకు ఆదేశించారు.
విజిలెన్స్ విచారణలో ఆరోపణలు నిర్దారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజ సహా ముగ్గురిపై కేసు నమోదయ్యింది. కాగా, ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జకియా ఖానం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, ఆదివారం ఆమె విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమె సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం.
ఈ ఆరోపణలపై జకియా ఖానం స్పందిస్తూ తాను విజయవాడకు బయలుదేరుతున్నట్టు తెలిసే కావాలనే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించారు. ఆ లేఖ ఇచ్చిన విషయం తనకు తెలియదని, పీఆర్వో కూడా వారం రోజులుగా లేరని ఆమె చెప్పారు.
కాగా, కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానంకు ఎమ్మెల్సీని చేయడమే కాకుండా, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మూడేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో బాగానే ఉన్న జకీయా ఈ మధ్య ఎందుకో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. జులైలో మంత్రి నారా లోకేశ్‌తో జకియా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రిని కలవడంతో టీడీపీలో చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి.
మరోవంక, వైసిపి ఎమ్యెల్సీ, కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన భరత్ కూడా తోమాల దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ 2.5 లక్షలు తీసుకొని మోసం చేసారన్తి అంటూ గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. ఆ మొత్తం ఆన్ లైన్ లో పంపినట్లు ఆధారాలు కూడా చూపుతున్నారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్