ఇండియా కూటమిలో చిచ్చు రేపిన అసెంబ్లీ ఎన్నికలు

ఇండియా కూటమిలో చిచ్చు రేపిన అసెంబ్లీ ఎన్నికలు
ఇండియా కూటమిలో చిచ్చు రేగింది. హర్యానా, జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చిచ్చురేపాయి. కూటమిని విచ్ఛిన్నంకు దారితీస్తున్నాయి.  కాంగ్రెస్‌ తీరు పట్ల కూటమిలోని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆ పార్టీ పొత్తు ధర్మం పాటించకుండా, రాష్ర్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నాయి.
 
ఆ పార్టీ అహంకారం, అతి విశ్వాసం వల్లే ఓడిపోయిందని మిత్రపక్షాలే దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ వాడుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. త్వరలో జరగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని పలు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.  తమ బలంతో కాంగ్రెస్‌ లాభపడుతున్నదని, తమ భుజాలపై రాజకీయంగా ఊరేగుతున్నదే కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల తమకు కలిగే ప్రయోజనం సున్నా అనే అభిప్రాయానికి వస్తున్నాయి.
కాంగ్రెస్‌ అహంకారం, అతివిశ్వాసం వల్లే బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తున్నదని భావిస్తున్నాయి. దీంతో ఒక్కో పార్టీ ఇండియా కూటమికి దూరం జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను ఇక మోయలేం అని చెప్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆదరణ కోల్పోతున్నదని, కేవలం తమ బలాన్ని ఉపయోగించుకొని మనుగడ సాధిస్తున్నదని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) వంటి పార్టీలతో పొత్తు కాంగ్రెస్‌కు చాలా కలిసొచ్చింది.  కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య పెరగడానికి తమ బలమే కారణమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. తాజాగా, జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 56 సీట్లు పోటీ చేసి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 32 సీట్లు కేటాయిస్తే ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 

అది కూడా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బలంతోకశ్మీర్‌ ప్రాంతంలోనే ఐదు స్థానాలను గెలిచింది. మరోవంక, పొత్తు ఉన్నప్పటికీ ఐదు స్థానాలలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులపై కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇంత ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్‌ భాగమవుతున్నది. దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అసంతృప్తిగా ఉంది.

కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాము గెలిచేవాళ్లమని  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శాసనసభాపక్ష నేత ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు.  కేంద్రంతో తమకు సమన్వయం అవసరమని, కేంద్రంతో కొట్లాట ద్వారా జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావని ఆయన పేర్కొనడం గమనార్హం.  ప్రధాని నరేంద్ర మోదీని తాను గౌరవిస్తానని, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పడం ద్వారా కాంగ్రెస్ తో పొత్తు ఉన్నప్పటికీ తాము బిజెపితో సామరస్యంగా వ్యవహరిస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

కాంగ్రెస్‌తో కలిసివెళ్తే బీజేపీని ఎదుర్కోలేమనే ఒక అభిప్రాయానికి ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ చేస్తున్న తప్పులు, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పాలనా వైఫల్యాలు తమ మెడకు చుట్టుకొంటాయనే ఆందోళనతో ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్‌తో పొత్తు అంటే మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడమే అని భావిస్తున్నాయి.

‘కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందనుకున్న చోట ప్రాంతీయ పార్టీలను కలుపుకోదు. ఆ పార్టీ బలంగా లేని రాష్ర్టాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకోవాలనే అహంకారం, హక్కుగా భావించడం, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే ఈ పరాభవానికి కారణం’ అని తృణమూల్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే తీవ్రస్థాయిలో విమర్శించారు. 

మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, స్థానిక నేతలను అవిధేయతను అదుపు చేయలేకపోయిందని శివసేన(ఉద్ధవ్‌ వర్గం) విమర్శించింది. గెలవాల్సిన ఆటలోనూ ఓడిపోయే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని ఎద్దేవా చేసింది. కూటమిలో పెద్దన్నగా ఏ పార్టీ భావించొద్దని కాంగ్రెస్‌ను ఉద్దేశించి శివసేన(ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని, పొత్తు సూత్రాలను, ప్రాంతీయ పార్టీలను గౌరవించాలని ఆర్జేడీ స్పష్టంచేసింది.

సమాజ్‌వాదీ పార్టీ దాదాపుగా కాంగ్రెస్‌కు దూరమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా తమకు ఐదు స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్‌ కోరుతున్నది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 2-3 సీట్లకు మించి ఇవ్వొద్దని భావిస్తున్నది. కాంగ్రెస్‌కు సంబంధం లేకుండానే ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో ఇండియా కూటమి అనే పేరు కొనసాగుతున్నప్పటికీ అందులో ఏయే పార్టీలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి, కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, సీపీఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మెజారిటీ సాధించింది. అయితే కూటమిలో ఆరు సీట్లతో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఇండిపెండెంట్లు షాకిచ్చారు. నలుగురు స్వతంత్రులు తాము ఎన్సీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరింది. 

మరోవంక తొలిసారి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ సహితం జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సమర్పించింది. దీంతో కాంగ్రెస్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగించే బలం ఎన్సీకి ఏర్పడింది.

హర్యానాలో ఆరు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఆప్ అన్ని సీట్లకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కోపంతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు లేదని స్పష్టం చేసింది.

 అతివిశ్వాసం కలిగిన కాంగ్రెస్‌పై, అహంకార బీజేపీపై ఒంటరిగా పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని ఆప్‌ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ స్పష్టం చేశారు. గత పదేండ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు లేకపోయినప్పటికీ తాము లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. అయినా హర్యానాలో ఆ పార్టీ మిత్రపక్షాలను కలుపుకోలేదని ఆమె ఆరోపించారు.

కాగా, తాము ఒంటరిగా బిజెపిని ఓడింపలేమని హర్యానా ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ గ్రహించాలి అంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి చురకలు అంటించారు.