`పంచ పరివర్తన`’ సాధనలో మొత్తం సమాజం క్రియాశీలకంగా పాల్గొనాలి

`పంచ పరివర్తన`’ సాధనలో మొత్తం సమాజం క్రియాశీలకంగా పాల్గొనాలి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది సంవత్సరం సందర్భంగా తలపెట్టిన `పంచ పరివర్తన’ లక్ష్య సాధనలో మొత్తం సమాజం క్రియాశీలకంగా పాలగొనాలని సర్‌సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ పిలుపిచ్చారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్ మైదానంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవంలో శనివారం మాట్లాడుతూ ఈ సందర్భంగా స్వయంసేవక్ లు  సామాజిక సామరస్యం, పర్యావరణం, పౌర కర్తవ్యం, కుటుంబ జ్ఞానోదయం, స్వయం ఆధారిత వ్యవస్థ అనే అంశాల వ్యాప్తికోసం సమాజంలో అందరిని కలుస్తారని చెప్పారు. 
 
వివిధ మాధ్యమాలు, సంస్థలు వ్యాప్తి చేస్తున్న వక్రీకరించిన ప్రచారం, చెడు విలువలు భారతదేశంలోని కొత్త తరం ఆలోచనలు, మాటలు, చర్యలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలతో పాటు పిల్లల చేతుల్లోకి మొబైల్ ఫోన్లు చేరాయని చెబుతూ అక్కడ ఏమి చూపిస్తున్నారు? పిల్లలు ఏమి చూస్తున్నారు? అనే దానిపై తగినంత నియంత్రణ లేదని విచారం వ్యక్తం చేశారు.
 
మొబైల్‌లో అందిస్తున్న కంటెంట్ గురించి ప్రస్తావించడం కూడా మర్యాదకు భంగం కలిగించడం లాంటిదని, చాలా అసహ్యంగా ఉందని స్పష్టం చేశారు. మన స్వంత ఇళ్లు, కుటుంబాలు, సమాజంలో వక్రీకరించిన ప్రకటనలు,వక్రీకరించిన ఆడియో-విజువల్ కంటెంట్‌పై చట్టపరమైన నియంత్రణ తక్షణ అవసరం అని ఆయన స్పష్టం చేశారు.
 
 ‘డీప్ స్టేట్’, ‘వోకీజం’, ‘కల్చరల్ మార్క్సిస్టులు’ వంటి వారు సంస్కృతి విలువలను, సంప్రదాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన హెచ్చరించారు. విద్యా వ్యవస్థ, మీడియా, మేధో సంప్రదింపులు మొదలైనవాటిని తమ ప్రభావంలోకి తీసుకురావడం, దాని ద్వారా సమాజంలోని ఆలోచనలు, విలువలు, విశ్వాసాలను నాశనం చేయడం వారి కార్యాచరణ అని చెప్పారు.
 
ఈ నేపథ్యంలో, శాంతిభద్రతలు,  పాలనా వ్యవహారాల్లో అపనమ్మకం, ద్వేషం పెంచి అరాచక, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు. ‘ప్రపంచం బలవంతులను పూజిస్తుంది, బలహీనులను కాదు’ అని పేర్కొంటూ ఇదీ నేటి ప్రపంచం తీరు అని తెలిపారు. అందువల్ల, సామరస్యాన్ని, సమతుల్య వాతావరణాన్ని నెలకొల్పడానికి పెద్దమనుషులు బలంగా మారాలని చెప్పారు.

శక్తి ధర్మాలతో కలిస్తే అది శాంతికి ఆధారం అవుతుందని, దుష్టులు స్వార్థ ప్రయోజనాల కోసం గుమిగూడి అప్రమత్తంగా ఉంటారని డా. భగవత్ చెప్పారు. శక్తి మాత్రమే వారిని నియంత్రించగలదని స్పష్టం చేశారు. పెద్దమనుషులు అందరితో సద్భావన కలిగి ఉంటారని, కానీ పెద్దమనుషులకు ఎలా కలిసిపోవాలో తెలియదని, దాని కారణంగా వారు బలహీనంగా కనిపిస్తారని చెప్పారు. వ్యవస్థీకృత శక్తిని నిర్మించడానికి, పెద్దమనుషులు కలిసి జీవించే సామర్థ్యాన్ని గ్రహించాలని సూచించారు.
 
హిందూ సమాజంలోని ఈ సాత్విక్ శక్తి సాధన పేరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని తెలిపారు. కోల్‌కతా ఘటన అత్యంత సిగ్గుచేటు అంటూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కృషి చేయాలని, మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేరాలు, రాజకీయాల మధ్య అనుబంధం కారణంగానే ఇలాంటి దుశ్చర్యలు సాధ్యమయ్యాయని చెప్పారు.
 
దేవాలయాలు, నీరు, శ్మశాన వాటికలు అన్ని వర్గాల ప్రజలకు ఉమ్మడిగా ఉండాలని డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అన్ని సంఘాలు కలిసి తమ సాధువులు, మహానుభావుల పండుగలను జరుపుకోవాలని ఆయన సూచించారు. దేశ, విదేశాల్లో ఏం జరుగుతోందో సమాజ ప్రజలకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా తమ ప్రాంతంలోని సమస్త ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.
 
ఈ సంవత్సరం ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంత అని చెబుతూ భారతదేశ పునరుజ్జీవనానికి ప్రేరేపించే శక్తులలో ఆయనకు ప్రముఖ స్థానం ఉందని తెలిపారు. అలాగే, ఇది భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి అని, ఆదివాసీ సోదరుల బానిసత్వం, దోపిడీ నుండి విముక్తి కోసం భగవాన్ బిర్సా ముండా ప్రారంభించిన ఉల్గులన్ స్ఫూర్తిని ఈ శతాబ్ది మనకు గుర్తు చేస్తుందని చెప్పారు. విదేశీ ఆధిపత్యం నుండి దేశానికి స్వేచ్ఛ, ఉనికి, గుర్తింపు, మన మతం  రక్షణ కోసం కూడా కృషి చేశారని తెలిపారు.
అంతకు ముందు, విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో డా. మోహన్ భగవత్ ‘శాస్త్ర పూజ’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మభూషణ్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ ఆయనతో పాటు పాల్గొన్నారు.