
* ఢాకాలోని ధాకేశ్వరి ఆలయాన్ని సందర్శించిన యూనుస్
బంగ్లాదేశ్‌లోని ఇటీవల దుర్గా పూజా మండపాలపై, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూ ఉండటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఢాకాలోని తాంటిబజార్‌లో పూజా మండపంపై దాడి, సత్కారాలోని ప్రఖ్యాత జోషోరేశ్వరి ఆలయంలో కాళీమాత కిరీటం చోరీ కావడం తమ దృష్టికి వచ్చాయని, ఇవి గర్హనీయమైన చర్యలని కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం ఒక ప్రకటనలో నిరసన వ్యక్తం చేసింది.
భారత ప్రభుత్వం ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేసిన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ శనివారం ఢాకాలోని శతాబ్దాల నాటి ధాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి హిందూ సమాజానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను “ప్రతి పౌరుని హక్కును నిర్ధారించే విధంగా” నిర్మించాలని కోరుకుంటుందని ఆయన స్పష్టం చేసారు.
“దుర్గా పూజ సమయంలో, చట్టాన్ని అమలు చేసే సంస్థలు చిత్తశుద్ధితో ప్రజా భద్రతను నిర్ధారించే ‘కఠినమైన’ పనిని చేశాయి. ఏది ఏమైనప్పటికీ, ఒక సందర్భాన్ని జరుపుకునేటప్పుడు చట్టాన్ని అమలు చేసే సంస్థల మద్దతును పొందడం అనేది ఒక సమిష్టి వైఫల్యం” అని అంగీకరించారు.
బంగ్లాలో ఆలయాలు, దేవీదేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ భారత ప్రభుత్వం అంతకు ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్లలో ఇలాంటివి చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపింది. 17 కోట్ల మంది బాంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతంగా ఉన్నారు.
“ముఖ్యంగా ఈ పవిత్రమైన పండుగ సమయంలో హిందువులు, అందరు మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాల భద్రతను నిర్ధారించాలని మేము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము” అని ఆ ప్రకటనలో కోరారు. బంగ్లాదేశ్‌లో ఈ నెలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దుర్గాపూజ వేడుకలకు సంబంధించి దాదాపు 35 అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయని ఢాకా పోలీసులు తెలిపారు.
“అక్టోబర్ 1 నుండి, కొనసాగుతున్న దుర్గా పూజ వేడుకలకు సంబంధించి దేశవ్యాప్తంగా 35 సంఘటనలు జరిగాయి, 11 కేసులు నమోదు చేశారు, 24 సాధారణ డైరీలు (జిడి) నమోదు చేశారు. 17 మంది వ్యక్తులను అరెస్టు చేశాయి” అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముహమ్మద్ మొయినుల్ ఇస్లాంచెప్పిన్నట్లు ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
శుక్రవారం ఢాకాలోని బనానీ పూజా మండపాన్ని ఇస్లాం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 32 వేలకు పైగా మండపాల్లో దుర్గాపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు గురువారం, ఢాకాకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటోగ్రామ్‌లోని జాత్రా మోహన్ సేన్ హాల్‌లోని దుర్గా పూజా మండపం వేదికపై అర డజను మంది పురుషులు ఇస్లామిక్ విప్లవానికి పిలుపునిస్తూ పాట పాడారు, ఇది విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
”హిందువులు, మైనారిటీలు, వారి ఆరాధనా స్థలాలకు ముఖ్యంగా పండుగ సమయాల్లో తగిన భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2021లో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని సందర్శించారు. వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు.
గత గురువారం దేవాలయంలో ఎప్పటిలాగే అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహానికి కిరీటం లేనట్లు వారు గుర్తించారు. ఆ మరుసటి రోజు రాత్రి ఢాకాలోని తాంటిబజార్ ఏరియాలోని ఒక ఆలయంపై అగంతకులు ఫైర్‌బాంబ్ విసిరారు. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందనప్పటికీ ఐదుగురు గాయపడ్డారు.కాగా, బంగ్లాలో దుర్గా పూజోత్సవాలకు ముందు గత నెలలో ఇస్లామిక్ సంస్థలు దాడులకు పాల్పడతామంటూ బెదరించింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ రెలిజియస్ ఎఫైర్స్ అడ్వయిజర్ ఏఎఫ్ఎం ఖలీద్ హుస్సేన్ ఇస్లామిక్ ఉగ్ర సంస్థలకు హెచ్చరికలు చేశారు. హిందూ పండుగల్లో ఆరాధనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
మరో ముగ్గురు హమాస్ బందీల విడుదల
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం