ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను

* సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ఆంధ్ర ప్రదేశ్ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు-వరదలతో అతలాకతలం అయిన ఏపీ, తాజాగా పొంచి ఉన్న తీపానుతో అప్రమత్తం అయ్యింది. దీనిపై విపత్తుల నిర్వాహణ విభాగం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. టోల్ ఫ్రీ నెంబర్లు, పునరావాస కేంద్రాలు, సహాయాక చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఏపీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీని ప్రభావంతో ఈ నెల 14 తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.  అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈనెల 14 నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఈనెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ఈనెల 14న వాయుగుండంగా మారి, 15వ తేదీన తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది ఈనెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నెల 14 తేదీ నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.

అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్కు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

భారీ వర్షం పడే సమయంలో ఆరుబయట ఉంటే ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండొద్దని సూచనలు ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ పలు ప్రాంతాల్లో భారీవర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం, అన్ని జిల్లాల కలెక్టర్లకూ సూచనలు జారీ చేసింది.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న సూచనతో, పోలీస్‌, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.