తెలంగాణ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఏక‌స‌భ్య క‌మిష‌న్

తెలంగాణ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఏక‌స‌భ్య క‌మిష‌న్

* స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్‌ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏక‌స‌భ్య క‌మిష‌న్‌ను నియ‌మించింది. 
 
హైకోర్టు విశ్రాంత జ‌డ్జి జ‌స్టిస్ ష‌మీమ్ అక్త‌ర్‌ను క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. 60 రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌మిష‌న్‌కు ప్ర‌భుత్వం సూచించింది. ఉప‌కులాల వారీగా ఎస్సీల వెనుక‌బాటుత‌నాన్ని క‌మిష‌న్ అధ్య‌య‌నం చేయ‌నుంది.  ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెకలను పరిగణనలోకి తీసుకొని, ఏకసభ్య కమిషన్‌ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు నిర్దేశించారు.
 
కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్‌కు సూచించారు. మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో చర్చించడంతోపాటు, వాటన్నింటినీ ఏకసభ్య కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదుల స్వీకరణకు ఉమ్మడి పది జిల్లాల్లో ఒకోరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
 
కాగా, రాష్ట్రంలో స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక‌, ఆర్థిక‌, విద్య అంశాల‌పై స‌ర్వే చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి శాంతి కుమారి వెల్ల‌డించారు. ఉద్యోగ‌, రాజ‌కీయ‌, కుల అంశాల‌పై స‌ర్వే చేయ‌నున్న‌ట్లు తెలిపారు. స‌ర్వే బాధ్య‌త‌ను ప్ర‌ణాళిక శాఖ‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు సీఎస్ శాంతి కుమారి వెల్ల‌డించారు. 60 రోజుల్లో స‌ర్వే పూర్తి చేయాల‌ని జీవోలో పేర్కొన్నారు.