దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ కోరింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామ్యమని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేరళ అసెంబ్లీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరపున ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.
‘ఈ ప్రతిపాదన అప్రజాస్వామికం. దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం. ఖర్చులను తగ్గించడానికి, సులభతరమైన పాలనను నిర్ధారించడానికి సులభమైన మార్గాలున్నాయి. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాలు చేయడం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉంది’ అని తెలిపారు.
కాగా, ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన అధికార కేంద్రీకరణకు దారితీస్తుందని మంత్రి ఎంబీ రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కేంద్రీకృత, ఏకీకృత పరిపాలనా వ్యవస్థను అమలు చేయడానికి బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండాలో ఇది ఒక భాగమని ఆయన ఆరోపించారు. మరోవైపు కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క శాసనసభ్యులైనా లేరు. అలాగే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్ర అసెంబ్లీగా కేరళ నిలిచింది.
More Stories
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం