అశ్రునయనాల మధ్య రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు

అశ్రునయనాల మధ్య రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు
పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు యావత్భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయి వర్లీలోని శ్మశానవాటికలో అతిరథ మహారథుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, టాటా గ్రూపు ఉన్నతోద్యోగులు, పారిశ్రామిక వేత్తలు రతన్‌ టాటాకు తుది వీడ్కోలు పలికారు.

తన దాతృత్వ గుణంతో అందరి మన్ననలూ చూరగొన్న ఆ వితరణశీలికి యావద్దేశంకన్నీటితో అంజలి ఘటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, గుజరాత్‌ సహా ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన మృతికి నివాళిగా ఒకరోజు సంతాపదినంగా ప్రకటించాయి. అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేశాయి.

ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన రతన్‌ టాటా భౌతికకాయానికి.. నాసేసలార్లు (అంతిమ సంస్కారాలకు సంబంధించిన క్రియలు చేయించేవారు) గురువారం ఉదయాన్నే స్నానం చేయించి, తెల్లటి సుద్రేహ్‌ (అంగీ), నడుము చుట్టూ ‘కుస్తీ (పార్శీలు పవిత్రంగా భావించే తాడు)’ ధరింపజేశారు. పార్శీ పురోహితులు కొంతసేపు ప్రార్థనలు చేశారు. టాటా కుటుంబసభ్యులంతా ఆయనకు తుదినివాళులర్పించారు.

అనంతరం ఆయన పార్థివదేహాన్ని శవపేటికలో ఉంచి, పుష్పాలతో అలంకరించి కుటుంబ సభ్యులు, చివరిదశలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాంతను నాయుడు తదితరులు వెంటరాగా.. దక్షిణ ముంబైలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సీపీ) ప్రాంగణానికి తరలించారు. 

ఉదయం 10.30 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. హిందు, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్శీ మతగురువులు పక్కపక్కనే నిలబడి.. భుజంభుజం కలిపి.. ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం 3.55 గంటల అనంతరం రతన్‌ టాటా పార్థివదేహాన్ని.. అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్లీ ఎలక్ట్రిక్‌ క్రిమెటోరియానికి తరలిస్తుండగా దారిపొడుగునా ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.

క్రిమెటోరియానికి చేరుకున్నాక.. అక్కడి ప్రేయర్‌ హాల్‌లో 45 నిమిషాలసేపు ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత పోలీసులు 21సార్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఎలక్ట్రిక్‌ దహనవాటికలో దహనం చేశారు. సంప్రదాయం ప్రకారం మిగిలిన మూడు రోజుల కార్యక్రమాలను కొలాబాలోని టాటా స్వగృహంలో పూర్తిచేస్తామని అంత్యక్రియలు నిర్వహించిన పురోహితుడు తెలిపారు. 

వాస్తవానికి పార్శీ సంప్రదాయం పక్రారం.. మరణానంతరం దహనం, ఖననం చేయరు. అలా చేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతాయని భావిస్తారు. మానవ దేహాన్ని ప్రకృతి ఇచ్చిన బహుమతిగా భావించి మళ్లీ ప్రకృతికే ఇవ్వాలని భావిస్తారు. అందులో భాగంగా.. ‘టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ లేదా ‘దఖ్మా’గా పిలిచే టవర్‌పై రాబందులకు వదిలిపెడతారు.

ఇలా చేయడాన్ని ‘దోఖ్మేనాశిని’గా వ్యవహరిస్తారు. భౌతికకాయాలను దహనం, ఖననం చేయడం వల్ల భూమి, గాలి, నీరు కాలుష్యమవుతాయనే ఉద్దేశంతో వారు ఇలా చేస్తారు. ఆ మృతదేహాలను రాబందులు తినేశాక.. అస్థికలు దఖ్మా కింది భాగంలో ఉన్న సెంట్రల్‌ వెల్‌లో పడిపోయి, డీకంపోజ్‌ అవుతాయి.

అయితే, రాబందుల సంఖ్య తగ్గిపోయి అవి అంతరించే దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఇటీవల చాలా మంది పార్శీలు తమ ఆప్తుల మృతదేహాలకు అంతిమ సంస్కారాలన్నీ పార్శీ సంప్రదాయంలో జరిపి, టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌పై వదిలిపెట్టడానికి బదులుగా ఎలక్ట్రిక్‌ దహనవాటికలో దహనం చేస్తున్నారు. మహనీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్‌ టాటా అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు.

ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది . కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.   మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ శరద్‌ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ సహా పలువురు నేతలు రతన్ టాటాకు అంజలి ఘటించారు. 

కాగా.. పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను (మరణానంతరం) ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రతిపాదించారు. ఈమేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ మహారాష్ట్ర క్యాబినెట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.